telugu navyamedia
సినిమా వార్తలు

అలాంటి నిర్మాతలు నా దగ్గరకు రావొద్దు… త్రివిక్రమ్ ను నేనే హైదరాబాద్ తీసుకొచ్చా.. : సునీల్

sunil back as star comedian

తాజాగా విడుదలైన “చిత్రలహరి” సినిమాలో హాస్య నటుడు సునీల్ ఓ కీలకమైన పాత్రను పోషించారు. ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా హిట్ కావడంతో సునీల్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

‘‘సినిమాలో తేజూ పాత్రలానే నా జీవితం మొదలైంది. సినిమాల్లోకి వెళతానంటే ఇంట్లో ప్రోత్సహించారు. విజేతలకు ప్రోత్సాహం అవసరం లేదు గానీ… ఓటమిలో ఉన్నవాణ్ణి కిందకు లాగకూడదని నా అభిప్రాయం. అదే ఈ కథలో చెప్పారు. తేజూ హీరో కాకముందు నుంచి అతడితో నాకు పరిచయం ఉంది. ‘తమ్ముడూ.. నిన్ను హీరోగా పెట్టి, డైరెక్షన్‌ చేస్తా’ అనేవాణ్ణి. తనతో నటించడం సంతోషంగా ఉంది. కామెడీ పాత్రల కోసమే బరువు పెరిగా. ప్రస్తుతానికి హీరోగా చేసే ఆలోచన లేదు. గతంలో హీరోగా చేయమని ఇద్దరు నిర్మాతలు అడ్వాన్సులు ఇచ్చారు. వారితో సినిమాలు వద్దంటే చేస్తామంటున్నారు. కథలు కుదిరితే చేస్తా. ‘మీతో హీరోగా సినిమా చేస్తాం. కమెడియన్‌ రోల్స్‌ మానేయండి’ అనే నిర్మాతలను నా దగ్గరకు రావొద్దని చెబుతున్నా. ప్రస్తుతం అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌, రవితేజ-వీఐ ఆనంద్‌ సినిమాలు చేస్తున్నా. ఓ పెద్ద హీరోతో చేయబోతున్నా. దాంతో నా కల నెరవేరబోతోంది’’ అన్నారు.

ఈ క్రమంలో తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చెప్పారు. భీమవరంలో త్రివిక్రమ్ తనకంటే ఏడాది సీనియర్ అని, సినిమాలపై మోజుతో మొదట తాను హైదరాబాద్ వచ్చానని, ఆ తర్వాత త్రివిక్రమ్ ను తీసుకొచ్చానని వెల్లడించారు. మీ బాధలను పంచుకునే ‘గ్లాస్’ మేట్ ఎవరు? అన్న ప్రశ్నకు టక్కున “త్రివిక్రమ్. అని చెప్పారు. “త్రివిక్రమ్ ను నాకోసమే హైదరాబాద్ తీసుకువచ్చాను. ఎలాంటి విషయాన్నయినా పంచుకోగలిగే మిత్రుడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ తో కాసేపు మాట్లాడితే చాలు ఎంతో ఉత్తేజం వస్తుంది. ఎవరు, ఎంత బాధలో ఉన్నా వాళ్లను మామూలు మనుషుల్ని చేయగలడు” అంటూ వివరించారు.

హీరోగా నటించిన సమయంలో తాను అతిగా జోక్యం చేసుకుంటాననే అపవాదుపై వివరణ ఇచ్చారు. తన సినిమాల్లో ప్రముఖ రైటర్లు ఎవరూ ఉండేవాళ్లు కాదని, ఓ మోస్తరు రచయితలను పెట్టుకుని తానే వాళ్లకు డబ్బులిచ్చి రాయించుకునేవాడ్నని సునీల్ వెల్లడించారు. ఆ విధంగా తనతో హిట్ కొట్టి ఆపై తాను ఎక్కువగా జోక్యం చేసుకునేవాడ్నని కొందరు రచయితలు దుష్ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తనపై అనవసరంగా ఆరోపణలు చేసివాళ్లలో ఎవరూ మళ్లీ హిట్ కొట్టలేదని తెలిపారు. చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఉంటే పొగిడేవాళ్లు ఉంటారని, పడిపోతే మరింత బాధకు గురిచేసేవాళ్లు కూడా ఉంటారని సునీల్ వివరించాడు.

Related posts