telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నీటితో .. కళకళలాడుతున్న శ్రీశైలం ..

srisailam project with full of water

ఎగువ రాష్ట్రాలలో పడుతున్న భారీ వర్షాలతో శ్రీశైలంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. దీనితో నీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది. రెండు రోజుల వ్యవధిలో శ్రీశైలంలోకి 30 టిఎంసిలు వచ్చి చేరింది. ప్రస్తుతం 838.7 అడుగులతో 59.98 టిఎంసిలు నిలువ ఉంది. ఉదయం 1,90,000 వేల క్యుసెక్కులు ఉన్న ఇన్‌ఫ్లో సాయంత్రానికి 2,02,704 క్యుసెక్కులకు పెరిగింది. ఎగువన ఆల్మట్టిలోకి 2,02,400 క్యుసెక్కులు వస్తుంటే దిగువకు 2,03,207 క్యుసెక్కులను వదులుతున్నారు. నారాయణపూర్‌లోకి 2,40,135 క్యుసెక్కులు వచ్చి చేరుతుంటే దిగువకు 2,10,128 క్యూసెక్కులను వదులుతున్నారు. జురాలలోకి 2,05,000 క్యుసెక్కులు వచ్చి చేరుతుంటే 2,08,000 క్యుసెక్కులను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం డ్యాం నీటి నిలువ సామర్థ్యం 215.6 టిఎంసిలు ప్రస్తుతం 60 టిఎంసిలకు చేరింది. ఇదే ప్రవాహం వారం రోజులపాటు కొనసాగితే పూర్తిగా నిండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

శ్రీశైలానికి భారీగా వరద నీరు రావడం వల్ల విద్యుత్‌ ఉత్పత్తితో పాటు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల సాగు, తాగునీటికి వినియోగించే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో కెసి కెనాల్‌కు, హంద్రీ-నీవా, సుజల స్రవంతికి కృష్ణా జలాలలను తరలించే స్థాయిలో నీటి మట్టాలు శ్రీశైలంలోకి రావడం పట్ల రాయలసీమ రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. కృష్ణానదిలో భారీ వరద ప్రవాహం ఉంటే తుంగభద్ర నది వెలవెలబోతున్నది. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యాం నీటి నిల్వలు చేరుకొని నిండు కుండలా ఉండేది. ప్రస్తుతం 31 టిఎంసిలు మాత్రమే ఉంది. నిన్నటి దాకా 25 వేల క్యుసెక్కులు తుంగభద్రలోకి వస్తుంటే అది శుక్రవారం నాటికి 17,297 క్యుసెక్కులకు పడిపోయింది.

Related posts