telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హిందూ ఆలయాలనే ఎందుకు… జ్యోతిక వ్యాఖ్యలపై హిందూవాదుల ఆగ్రహం

jotika

తమిళనటుడు సూర్యను పెళ్లిచేసుకున్న తరవాత వెండితెరకు కాస్త దూరమయ్యారు జ్యోతిక. అయితే, నటనపై మక్కువతో ప్రస్తుతం ప్రాధాన్యమున్న పాత్రలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. కిందటేడాది ‘రాచ్చసి’ సినిమాలో జ్యోతిక ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాలో నటనకు గాను ‘జేఎఫ్‌డబ్ల్యూ మూవీ అవార్డ్స్ 2020’లో ఆమె ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో ఈ అవార్డుల ప్రధానోత్సవ వేడుక జరిగింది. అవార్డు తీసుకున్న అనంతరం జ్యోతిక మాట్లాడుతూ హాస్పిటల్, స్కూల్స్‌ను ఇంకా బాగా నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ క్రమంలో ఆమె ఒక ఆలయాన్ని ఉదాహరణగా తీసుకున్నారు.

‘రాచ్చసి’ సినిమా షూటింగ్‌లో భాగంగా తంజావూర్ వెళ్లాం. అక్కడి బృహదీశ్వర ఆలయం చాలా ఫేమస్. మేం ఆ ఆలయానికి వెళ్లాం. ఉదయ్‌పూర్‌లో ప్యాలెస్ మాదిరిగా ఉంది. ఆలయాన్ని చాలా బాగా నిర్వహిస్తున్నారు. అయితే, ఆ మరుసటి రోజు హాస్పిటల్‌లో షూటింగ్ చేశాం. ఆ హాస్పిటల్‌ను చాలా దరిద్రంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి నాదొక రిక్వెస్ట్.. నిజానికి నా ‘రాచ్చసి’ సినిమాలో కూడా చెప్పాం. ఆలయాలను బాగా శుభ్రం చేస్తాం, పెయింట్ వేస్తాం, బాగా మెయింటైన్ చేస్తాం, ఆలయ హుండీలో డబ్బులు వేస్తాం. దయచేసి అవే డబ్బులు హాస్పిటల్స్‌కు పెట్టండి, పాఠశాలల అభివృద్ధికి వాడండి. ఇది చాలా ముఖ్యం. దయచేసి హాస్పిటల్స్, స్కూల్స్‌కు కూడా విరాళాలు ఇవ్వండి అని జ్యోతిక మాట్లాడుతూ అన్నారు.

అయితే కొంత మంది హిందూవాదులు జ్యోతిక వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతిక హిందూ ఆలయాలనే ఎందుకు అంటున్నారు? ఇతర మతాల మందిరాలపై ఎందుకు వ్యాఖ్యలు చేయలేదు అంటూ మండిపడుతున్నారు. తాజాగా శ్రీవిల్లిపుత్తూర్ ఆండాల్ ఆలయ స్వామిజీ శ్రీ శథగోప రామానుజ జీయర్.. జ్యోతిక వ్యాఖ్యలను ఖండించారు. తంజావూర్ ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా జ్యోతిక మాట్లాడారని మండిపడ్డారు.ఆలయాలు ఉండటం వల్లే మనం బతకగలుగుతున్నామని స్వామీజీ అన్నారు. భవిష్యత్తులో హిందూ మతంపై ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు. అయితే, జ్యోతికకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ జ్యోతిక మాట్లాడిన దానిలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు ఆమె అభిమానులు.

Related posts