telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

మద్యం రవాణాకు .. ప్రత్యేక అంబులెన్సులు..

NO ALCOHOL IN TELANGANA

మద్యం రవాణాకు నాయకులు కనుక్కోన్న చక్కటి చిట్కా.. మద్యం బాబులంటే వారికి ఎంతటి ప్రేమో.. అందులో ఆవగింజంత దేశంపట్ల ఉంటె.. ఎప్పుడో బాగుపడేది. ఎన్నికలు వచ్చేసరికి, మద్యం, నగదు తో పని పడుతుంది. ఆయా పార్టీలు ప్రజలను మభ్యపెట్టేందుకు ఎవరి ప్రయత్నం వారు చేస్తూనే ఉంటారు. దానిని అడ్డుకున్నట్టుగా అధికారులు కూడా భలే నిఘా కాస్తుంటారు. ఈ నాటకాలన్నీ ప్రజలు చూస్తూనే ఉంటారు.. అలా చూస్తూండబట్టి దేశానికి స్వాతంత్రం వచ్చిందే తప్ప, అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఇక ఇప్పటి పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఎవరికీ అనుమానం రాకుండా అంబులెన్స్‌లో మద్యాన్ని తరలిస్తుండగా కరీంనగర్‌ ఒకటో టాణా పోలీసులు పట్టుకున్నారు. దీనిపై ఇప్పటి వరకు నలుగురు వ్యక్తులపై కేసులను న మోదు చేశారు. ఈ మేరకు శుక్రవారం కరీంనగర్‌ సిటీ ఏసీపీ డాక్టర్‌ పి. అశోక్‌ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఎన్నికల నేపథ్యంలో గురువారం రాత్రి కరీంనగర్‌లోని హౌసింగ్‌బోర్డు ప్రాంతంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా వెళుతున్న అంబులెన్స్‌ను ఆపి తనిఖీ చేయగా మద్యం పట్టుబడింది. చొప్పదండి మండలం కంతనపల్లికి చెందిన అంబులెన్స్‌ డ్రైవర్‌ దామెరపల్లి తిరుపతిని విచారించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిడితోటలో పంచాయతీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థి నారగొని విజయ్‌కుమార్‌ కోసం మద్యాన్ని తీసుకువెళుతున్నానని అతడు వెల్లడించాడు. సదరు అభ్యర్థి సోదరుడు డాక్టర్‌ కుమార్‌ మద్యాన్ని తీసుకువెళ్లేందుకు అంబులెన్స్‌ను అద్దెకు మాట్లాడాడని వివరించారు.

మొత్తం 1.20 లక్షల విలువ చేసే ఇంపీరియల్‌ బ్లూ, ఎంసీ పుల్‌ బాటిళ్లు, నాలుగు కాటన్ల కింగ్‌ఫిషర్‌ బీర్లను స్వాధీనం చేసుకుని అంబులెన్స్‌ను సీజ్‌ చేశారు. అంబులెన్స్‌ డ్రైవర్‌, అభ్యర్థి, అభ్యర్థి సోదరుడితోపాటు ఎక్కువ మొత్తంలో మద్యాన్ని విక్రయించిన కోతిరాంపూర్‌లోని మద్యం దుకాణం నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేశామని తెలిపారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం, నగదు పంపిణీ, బహుమతులను అందజేయడం నేరమని చెప్పారు. మద్యం దుకాణాల నిర్వాహకులు ఎక్కువ మొత్తంలో మద్యం అడిగిన సందర్భాలలో వివరాలను ఆరా తీయాలని ఈ సందర్భంగా ఏసీపీ అశోక్‌ సూచించారు. సమావేశంలో కరీంనగర్‌ ఒకటో ఠాణా సీఐ తుల శ్రీనివాసరావు, ఎస్సై నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts