telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనవసర ప్రచారం చేస్తున్నారు… ప్రెస్ మీట్ లో ఎస్పీ చరణ్ అసహనం

SP-Charan

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూయడంతో యావత్ సినీ లోకం విషాదంలో మునిగిపోయింది. అయితే బాలు వైద్యంపై, హాస్పిటల్ బిల్లులపై సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్‌ తీవ్రంగా ఖండించారు. ఎస్పీ చరణ్‌ సోమవారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రి యాజమాన్యంతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. కట్టుకథలు అల్లి, అనవసర ప్రచారం చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “నాన్నగారు ఆస్పత్రిలో చేరిన తర్వాత ప్రతి వారం బిల్స్‌ చెల్లిస్తూనే ఉన్నాం. చివరిగా నాన్న చనిపోయిన తర్వాత కూడా బిల్స్‌ గురించి అడిగితే.. ముందు భౌతికకాయాన్ని తీసుకెళ్లమని చెప్పి మాకు గౌరవం ఇచ్చారు. మూడు కోట్లు ఖర్చు అయింది. వైస్‌ ప్రెసిడెంట్‌ సహకరించారు అంటూ కట్టుకథలు అల్లుతున్నారు. కోటి 85 లక్షలు కట్టాలి అని ఎందుకు సోషల్‌ మీడియాలో అనవసర ప్రచారం చేస్తున్నారు. కట్టుకథలతో మాకు ఎంజీఎం ఆస్పత్రి యాజమాన్యంతో ఉన్న రిలేషన్‌ చెడగొట్టవద్దు. మేము ఇంకా బాధలోనే ఉన్నాం. నాన్నగారి స్మారక స్థూపం నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఒక్కరూ నాన్నగారి సమాధి సందర్శనకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాం. నాన్నగారే మాకు పెద్ద భారత రత్న.. ఒకవేళ ఇస్తే స్వాగతిస్తాం” అని అన్నారు.

కాగా కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. మొదట జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలతో బాధపడిన బాలు.. ఆగస్టు 13న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ రోజు నుంచి ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌తో పాటు ఈసీఎంవో (ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సపోర్ట్‌తో చికిత్స అందించారు. ఆ తర్వాత కరోనా నుంచి కోలుకున్న ఆయన.. తిరిగి అనారోగ్యం పాలై సెప్టెంబర్ 25వ తేదీన ఒంటి గంట 4 నిమిషాలకు ఆసుపత్రిలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. సుమారు 50 రోజులు హాస్పిటల్‌లోనే బెడ్‌పై ఉండి మృత్యువుతో పోరాడి ఓడిపోయారు.

Related posts