telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎస్పీ బాలును కూర్చోబెట్టి ఖననం… వీర శైవ జంగమ సాంప్రదాయం

SPB

దిగ్గజ గాయకుడు, నటుడు, సంగీత దర్శకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకం నుంచి నిష్క్రమించారు. ఈ రోజు (సెప్టెంబర్ 26) మధ్యాహ్నం చెన్నై సమీపంలోని తామరైపాకం ఫామ్‌హౌస్‌లో బాలు అంత్యక్రియలు ముగిశాయి. తమిళనాడు ప్రభుత్వం బాలు అంత్యక్రియలను ప్రభుత్వ లాంచనాలతో జరిపించింది. ప్రభుత్వం తరపు నుంచి గౌరవ వందనం సమర్పించి.. గాలిలో తుపాకులు పేల్చి ప్రభుత్వం నివాళులు అర్పించింది. అనంతరం ఆయన ఖననం వీర శైవ జంగమ సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ సాంప్రదాయం ప్రకారం బాలుని కూర్చొన్న పొజీషన్‌లో ఖననం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ తరపు నుంచి కొందరు, బాలు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు కొందరు మాత్రమే హాజరయ్యారు. ఎస్పీ బాలు అంత్యక్రియల్లో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పాల్గొని ఆయనకు నివాళి అర్పించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్ హాజరయ్యారు. ఇక సినిమా సెల‌బ్రిటీలు దేవి శ్రీ ప్రసాద్, భార‌తీరాజా, మ‌నో, యాక్షన్ కింగ్ అర్జున్ త‌దిత‌రులు అంత్యక్రియ‌ల్లో పాల్గొన్నట్టు సమాచారం. ప్రస్తుతం అభిమానులను దూరం పెట్టినప్పటికీ.. త్వరలోనే బాలు సమాధిని అద్భుతంగా తీర్చిదిద్ది సందర్శనా స్థలంగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాగా తమిళనాడులో వీరశైవ జంగమ, ఆరాధ్య కులస్థులను ఈ విధంగానే కూర్చోబెట్టి ఖననం చేస్తారు. తమిళనాడులో చాలా కులాలు ఇదే సంప్రదాయాన్ని పాటిస్తాయని సమాచారం. సాధారణంగా వైష్ణవుల్లో సంసార జీవితం గడిపిన వారిని ఖననం చేయరు. దహనం చేస్తారు. కానీ, వీరశైవుల్లో మాత్రం ఖననమే చేస్తారు. అది కూడా కూర్చున్న పొజిషన్‌లో బాలు విషయంలో కూడా అదే జరిగింది.

Related posts