telugu navyamedia
telugu cinema news

ఎన్టీఆర్ కు శోభన్ బాబును పరిచయం చేసిందెవరో తెలుసా ?

ntr-with-shobhan-babu

శోభన్ బాబు ఆంధ్రులకు అందాల నటుడు. ఆయన ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రల్లో రాణించాడు. తన చలనచిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకుని ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయారు. “సోగ్గాడు”గా ఎంతోమంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నట భూషణుడు శోభన్ బాబు. అమితంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథానాయకుడు. శోభన్ బాబు గురించి చాలామందికి తెలియని విషయాలను నవ్యమీడియా వేదికగా పాఠకుల కోసం అందిస్తున్నాము… అందులో భాగంగానే ఎన్టీఆర్ కు శోభన్ బాబుకు మొదటిసారిగా ఎలా పరిచయం జరిగిందో తెలుసుకుందాం.

మైలవరంలో పదోతరగతి పూర్తి చేసుకున్న శోభన్ బాబు విజయవాడ లయోలా కాలేజీలో ఇంటర్ కోసం చేరారు. అయితే అప్పటికే శోభన్ బాబుకు సినిమాలపై చాలా ఇష్టం ఉండేది. ఇంటర్ లో ఉండగానే… విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీ డ్రిల్ మాస్టర్ వీరికి కూడా ఆటలు నేర్పించేవారు. ఆయన శోభన్ బాబుతో చాలా సరదాగా ఉండేవారు. అంతేకాదు శోభన్ బాబుతో ఎక్కువగా నువ్వు హ్యాండ్సమ్ గా ఉంటావు. సినిమాల్లో ట్రై చెయ్ అంటూ ఎప్పుడూ అంటుండేవారు. డ్రిల్ మాస్టర్ చెప్పిన మాటలు విన్న శోభన్ బాబు మాత్రం మొదట్లో ఆయన ఆట పట్టించడానికే అలా అంటున్నారని అనుకునేవారట. కానీ ఆయన కన్పించినప్పుడల్లా అదే మాట అనడంతో శోభన్ బాబులో హీరో కావాలన్నా కాంక్ష మనసులో మరింత బలీయమైంది.

దీంతో ఒకరోజున శోభన్ బాబు “నాకు నిజంగానే సినిమా హీరో అవ్వాలని ఉందండి” అంటూ తన మనసులో ఉన్న మాటను డ్రిల్ మాస్టారుతో చెప్పేశారు. అదివిన్న మాస్టారు “నిజమా… మరి ఇంతకాలం చెప్పలేదేంటయ్యా… అయితే నీకు ఎన్టీఆర్ ను పరిచయం చేయాల్సిందే..” అనే డైలాగ్ తో శోభన్ బాబుకు షాకిచ్చారు. మాస్టారు మాట విన్న శోభన్ బాబుకు మతిపోయినంత పనయ్యింది. ఆయన నిజంగానే ఆట పట్టిస్తున్నారని అర్థం చేసుకున్న శోభన్ బాబు కాస్త అందంగా ఉన్నావు అని ఎవరైనా అనగానే హీరోనయిపోవాలనుకుంటే ఇలాగే జరుగుతుంది అని మనసులో అనుకుని ముఖం చిన్నబుచ్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతేకాదు అప్పటి నుంచి మాస్టారుతో మాట్లాడ్డం కూడా మానేశారు.

అయితే ఓ రోజు డ్రిల్ మాస్టారు మద్రాసులో ఏదో పని ఉండి వెళ్తున్నారు. శోభన్ బాబును కూడా తనతో పాటు రమ్మన్నారు. కానీ శోభన్ ముందు రానని బెట్టు చేశారు. కానీ తరువాత ఆయనతో పాటు మద్రాసు వెళ్లారు. తనతో పాటు శోభన్ ను మద్రాసు తీసుకెళ్లిన డ్రిల్ మాస్టారు శోభన్ బాబును నేరుగా ఎన్టీఆర్ ముందు కూర్చోబెట్టారు. ఇంకేముంది శోభన్ బాబుకు మతిపోయి నోటమాట రాలేదు. ఇంతకాలం తనను ఆట పట్టిస్తున్నారనుకున్న డ్రిల్ మాస్టారు, ఎన్టీఆర్ చిన్నప్పటి స్నేహితులట. ఎన్టీఆర్ ముందు కూర్చున్న శోభన్ బాబు నుదుట చెమట పడుతుండగా, టెన్షన్ తో చేతుల్ని నలిపేసుకుంటున్నారు. ఆయన వెన్నులో సన్నని వణుకు… శోభన్ బాబును ఒకసారి కిందనుంచి పైకి చూశారు ఎన్టీఆర్ “బ్రదర్ మీరు సినిమాల్లో పైకొస్తారు. కానీ ముందు డిగ్రీ పూర్తి చెయ్యండి” అన్నారు. మాటల మధ్యలో ఎన్టీఆర్ తాను గుంటూరు ఏసీ కాలేజీలో చదివానని చెప్పడంతో అప్పటికప్పుడు శోభన్ బాబు కూడా అదే కాలేజీలో చదవాలని నిర్ణయించుకున్నారు. అలా ఇంటర్ తరువాత బిఎస్సి చదవడానికి గుంటూరు ఏసీ కాలేజీలో స్నేహితునితో కలిసి అడుగుపెట్టారు.

ఇంకేముంది అప్పటికే ఎన్టీఆర్ ను కలవడం, ఇప్పుడు ఎన్టీఆర్ చదివిన కాలేజీలో అడుగుపెట్టడంతో తాను కూడా ఎన్టీఆర్ అంత గొప్ప నటుడు కావాలని కలలు కనడం మొదలుపెట్టారు శోభన్ బాబు. శోభన్ బాబు తన రూంను ఎన్టీఆర్, ఏఎన్నార్ ఫొటోలతో నింపేసేవారు. శోభన్ బాబుకు ఎన్టీఆర్ ముక్కు అంటే చాలా ఇష్టం. అందుకే స్నేహితుడితో ఎప్పుడూ “నా ముక్కు కూడా ఎన్టీఆర్ అంత అందమైన ముక్కే” అంటుండేవారు. అలా తన డ్రిల్ మాస్టారు వల్ల శోభన్ బాబు మొదటిసారిగా ఎన్టీఆర్ ను కలిశారు. ఆ తరువాత కాలంలో ఇద్దరూ కలిసి సినిమాల్లో నటించారు కూడా. 

Related posts

లోక్‌సభ ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌ పోటీ!

vimala p

పింక్ సిటీలో ప్రభాస్ కు ఘనస్వాగతం

vimala p

అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో.. తెలంగాణ టూరిజం సాంగ్ కు .. ఉత్తమ అవార్డు..

vimala p