telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

యాషెస్‌ రెండో టెస్టు : .. స్టీవ్‌ స్మిత్‌ తలకి బలమైన గాయం..

smith injured in ashes series test match

యాషెస్‌ రెండో టెస్టులో భాగంగా ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఆసీస్ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ తలకి బలమైన గాయమైంది. ఇంగ్లాండ్‌ పేసర్ ఆర్చర్ 92 కి.మీ వేగంతో విసిరిన బౌన్సర్‌ స్మిత్‌ తలకి నేరుగా తగిలింది. దీంతో అతడు నేలపై పడిపోయాడు. వెంటనే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ వైద్య బృందాలు అతడికి చికిత్సను అందించాయి. ఆసీస్‌ వైద్యుని సూచనల మేరకు అతడు రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. అప్పటికి స్మిత్ 80 పరుగులతో ఉన్నాడు. సిడిల్‌ ఔటైన అనంతరం తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్‌ మరో 12 పరుగులు చేసి వోక్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆర్చర్‌పై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆటగాడిని గాయపరిచి ఎలా నవ్వుతున్నావని అతడిని విమర్శిస్తున్నారు.

ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో ఆర్చర్ బౌలింగ్‌లోనే ఆసీస్‌ ఆటగాడు అలెక్స్ కారీకి దవడ పగిలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్‌ 250 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 258 పరుగులు సాధించిన ఇంగ్లాండ్‌కు ఎనిమిది పరుగుల ఆధిక్యం లభించింది. బాల్‌ టాంపరింగ్‌ వివాదంతో ఏడాది పాటు నిషేధానికి గురైన స్మిత్‌ యాషెస్‌తో టెస్టు క్రికెట్‌లో పునరాగమనం చేసాడు. తొలి టెస్టులో 144, 142 పరుగులతో జట్టును విజయ తీరాలకు చేరాడు. రెండో టెస్టులోని తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. యాషెస్‌లో వరుసగా ఏడు సార్లు 50 పరుగులకు పైగా పరుగుల సాధించిన ఆటగాడిగా స్మిత్‌ రికార్డు సృష్టించాడు.

Related posts