telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

తెలంగాణ బిడ్డకు అరుదైన అవకాశం

Sisilika Ramaraju

మాతృశ్రీ ఇంజనీరింగ్‌ కాలేజీలో బి.ఇ. రెండవ సంవత్సరం చదువుతున్న సిసిలిక రామరాజు హైదరాబాదులో జన్మించింది. అంతర్జాలంలో నిర్విరామంగా 32 గంటలపాటు జరగబోయే ‘7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు’లో (దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్స్‌బర్గ్‌ కేంద్రంగా) కథారచయిత్రిగా పాల్గొనే అరుదైన అవకాశం ఆమెకు లభించింది. అక్టోబరు 10, 11 తేదీలలో భారత ఉపరాష్ట్రపతి మాన్యులు శ్రీ ఎమ్‌. వెంకయ్యనాయుడు గారిచే ప్రారంభించబడే సదస్సులో సిసిలికా రామరాజు తాను స్వయంగా రచించిన ‘ఈ కథ పేరు కరోనా’ అనే కథను చదివే అవకాశం కలిగింది. అతి పిన్నవయస్సుగల రచయిత్రిగా ఆమె ఈ సభలలో పాల్గొంటున్నది. 5 ఖండాల నుంచి లబ్ధప్రతిష్ఠులైన 175 మంది సాహితీవేత్తలు వివిధ సాహిత్యాంశాల మీద ప్రసంగించబోయే ఈ అంతర్జాతీయ అంతర్జాల వేదికలో పాల్గొంటున్నందుకు మాతృశ్రీ ఇంజనీరింగ్‌ కాలేజీవారు హర్షం ప్రకటించారు.

Sisilika Ramaraju

తాను రాసిన ‘ఈ కథ పేరు కరోనా’ అనే కథను సదస్సు ప్రధాన నిర్వాహకులు డా॥ వంగూరి చిట్టెన్‌ రాజుగారికి పంపించి తనకు సభలలో పాల్గొనే అవకాశం ఇవ్వవలసిందిగా కోరినట్లు సిసిలికా రామరాజు తెలియజేశారు. ‘డా॥ వంగూరి చిట్టెన్‌ రాజుగారు తన రచనను మెచ్చుకుని ‘7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు’లో చదివే అవకాశం ఇవ్వడం, తన తొలికథతో తనను రచయిత్రిగా పరిచయం చేసి ప్రోత్సహించడం తానెప్పటికీ మరువలేని మధురానుభూతి’ అని సిసిలిక అన్నారు. తాను మొదట్నుంచి ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో చదివినప్పటికీ తెలుగుభాష అంటే ఇష్టం, అభిమానం వల్ల తెలుగులో కథ రాయడానికి కారణమైనట్లు సిసిలిక రామరాజు అన్నారు.

రచయిత్రి తండ్రి వంశీధర్‌ రామరాజు కూడా రచయిత. తెలుగులో చాలా కథలు రాశారు. 10 ఇంగ్లీషు నవలలు అమెజాన్‌ ద్వారా ప్రచురించారు. వంశీధర్‌ రామరాజు కూడా ఈ సభలలో 5వ వేదికలో 10వ తేదీన తన కథ చదవనున్నారు. రచయిత్రి నాయనమ్మ డా॥ తెన్నేటి సుధాదేవి రచించిన ‘తెన్నేటి సుధ వ్యాసకదంబం’ అనే గ్రంథాన్ని కూడా ఈ సభల్లో ఆవిష్కరించనున్నారు. ఆమె తండ్రి, నాయనమ్మ పాల్గొంటున్న ఈ తెలుగు సాహితీ సదస్సులో తానూ పాల్గొనడమనేది ఒక అపూర్వ సంఘటనగా భావిస్తున్నట్లు ఆమె చెప్పారు.

Related posts