telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

దొంగలకు అబ్బిన టెక్నాలజీ.. ఒక్క కారును .. 3సార్లు దొంగిలించి.. !

single car theft 3 times and sold 3 times

టెక్ తెచ్చిపెడుతున్న తిప్పలు ఒక్కోసారి వినడానికే విచిత్రంగా ఉంటున్నాయి. అసలు ఆ టెక్ ను అలా ఉపయోగించవచ్చని, అలాంటి సందర్భాలు ఎదురైతే తప్ప తెలియడంలేదు. ఇటీవల ఒకే కారును పదేపదే దొంగతనం చేస్తూ, అమ్ముతూ సొమ్ము చేసుకుంటుంది ఒక దొంగల ముఠా. అమ్మేసిన కారును తిరిగి కొట్టేసేందుకు మారుతాళాలు.. అది ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు కారులో రహస్యంగా జీపీఎస్ సిస్టం ఏర్పాటు చేసిన దొంగలు అమ్మేసిన వారం లోపే దానిని కొట్టేసేవారు. చివరికి మరోమారు అదే పనిచేసి దొరికిపోయారు. తమిళనాడులో జరిగిందీ ఘటన. కణతూరుకు చెందిన థనిగై అనే సినీ నిర్మాత తన కారు పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. కారు అమ్మకానికి ఉందంటూ ఓ వెబ్‌సైట్‌లో ప్రకటన చూసిన థనిగై జూన్ 7న కారు విక్రయదారులను కలిశాడు. కారును పరిశీలించిన ఆయన రూ.6 లక్షలకు దానిని కొనుగోలు చేశాడు. అయితే మూడు రోజుల తర్వాత అంటే ఈ నెల 10న కణతూరులోని తన గెస్ట్‌హౌస్ బయట పార్క్ చేసిన కారు కనిపించకుండా పోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, థనిగై మొబైల్ కాల్ రికార్డును పరిశీలించి గణేశన్, భారతి అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు చెప్పింది విని పోలీసులు విస్తుపోయారు. తాము ఇప్పటికి మూడుసార్లు ముగ్గురు వ్యక్తులకు కారును విక్రయించినట్టు చెప్పడంతో అవాక్కయ్యారు. నిందితులు తొలుత నవనీతకృష్ణ అనే వ్యక్తికి కారును విక్రయించారు. అందులో అమర్చిన జీపీఎస్ సిస్టం ఆధారంగా వారం తర్వాత మారు తాళాలతో కారును దొంగిలించి వెల్లూరుకు చెందిన మరో వ్యక్తికి విక్రయించారు. ఆ తర్వాత అతడి నుంచి కారును దొంగిలించి ఈ నెల 7న థనిగైకి విక్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మిగతా నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Related posts