telugu navyamedia
క్రీడలు

సింగపూర్ ఓపెన్ 2022 ఫైనల్స్‌కి దూసుకెళ్లిన పీవీ సింధు…

సింగపూర్‌ ఓపెన్‌ 2022 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు అద్భుతం చేసింది. . శనివారం జరిగిన సెమీఫైనల్లో జపాన్‌ క్రీడాకారిణి, వరల్డ్‌ 38వ ర్యాంకర్‌ సయినా కవాకమితో జరిగిన సెమీస్‌లో 21-15, 21-7 తేడాతో విజయం సాధించింది.

తొలి సెట్‌ నుంచే ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించిన సింధు.. కేవలం 32 నిమిషాల్లోనే గేమ్‌ను ముగించింది. ఈ ఏడాది రెండు సూపర్‌ 300 టైటిల్స్‌ (సయ్యద్‌ మోదీ, స్విస్‌ ఓపెన్‌) సాధించిన సింధు.. సింగపూర్ ఓపెన్‌ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి.

మరో సెమీ ఫైనల్‌లో జపాన్ ప్లేయర్ ఆయా ఓహోరీ, చైనా ప్లేయర్ జీ యి వాంగ్‌ మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన ప్లేయర్‌తో ఫైనల్‌ ఆడబోతోంది పీవీ సింధు.. 2022లో పీవీ సింధుకి ఇది మూడో ఫైనల్ మ్యాచ్. ఇంతకుముందు ఈ ఏడాది ఫైనల్ చేరిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీ, స్విస్ ఓపెన్ 2022 టోర్నీల్లో విజేతగా నిలిచింది పీవీ సింధు

డబుల్‌ ఒలింపిక్‌ మెడలిస్ట్‌ అయిన సింధు.. క్వార్టర్‌ ఫైనల్లో చైనా షట్లర్‌ హాన్‌ యుయేపై 17-21, 21-11, 21-19 తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే, కెరీర్‌లో దాదాపు అన్ని సూపర్‌ 500 టైటిల్స్‌ సాధించిన సింధు సింగపూర్‌ ఓపెన్‌ మాత్రం గెలవలేకపోయింది. దీంతో సింధు ఈసారి ఎలాగైనా ఈ టైటిల్‌ గెలవాలని పట్టుదలగా ఉంది. ప్రస్తుత టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించిన సహచర షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ప్రొఫెషనల్‌గా మారకముందే 2010లో సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచింది.

Related posts