telugu navyamedia
సినిమా వార్తలు

శోభన్ బాబు పర్సనల్ ఛాంబర్ లోని సీక్రెట్స్ ఇవే

shobhan-babu

“సోగ్గాడు”గా ఎంతోమంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ నటుడు శోభన్ బాబు. అమితంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథానాయకుడు. ఆయన ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రల్లో రాణించాడు. తన చలనచిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకుని ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయారు. శోభన్ బాబు పర్సనల్ ఛాంబర్ లోని సీక్రెట్స్ గురించి చాలామందికి తెలియని విషయాలు కొన్ని నవ్యమీడియా పాఠకుల కోసం…

shobhan-babu-2

చెన్నైలోని నుంగంబాకం దగ్గరలోని రాజారాం మోహతానగర్ మెయిన్ సెంటర్లో తూర్పువైపు కార్నర్ లో శోభన్ బాబు ఇల్లు ఉంటుంది. అక్కడ శాంతి, ప్రశాంతి అనే రెండు ఇళ్ళు కన్పిస్తాయి. ఎదురుగా ఉండే ఇల్లు శాంతి. కుడిపక్కగా ఉన్న ఇల్లు ప్రశాంతి. శాంతి అనేది శోభన్ బాబు ఆయన కుటుంబంతో కలిసి నివసించే ఇల్లు. ప్రశాంతి అనేది ఆఫీస్ కు సంబంధించిన పనులకు మాత్రమే ఉపయోగించే ఇల్లు. శోభన్ తన అభిమానులను, అతిథులను ప్రశాంతిలోనే కలుసుకునేవారు. అంతేకాదు సినిమాల్లో నటించే రోజుల్లో ఆయన ప్రశాంతిలోనే మేకప్ వేసుకునేవారు. ఎదురుగా ఉన్న మేకప్ టేబుల్ పై అద్దానికి అటూ ఇటూ ఆయన చెల్లెలి ఫోటో, తాతగారి ఫోటో ఉంటాయి. మేకప్ వేయించుకుంటూ వారి ఫోటోలను చూడడం శోభన్ బాబుకు ఎంతో ఇష్టం. ఆ ఇంట్లోని హాల్లో “దేవాలయం” చిత్రంలోని దశావతారాల గెటప్స్ రంగుల ఫోటోలు ఉంటాయి.

shobhan-babu1

ఇక శోభన్ బాబు పర్సనల్ ఛాంబర్ విషయానికొస్తే… చాలా సింపుల్ గా ఉంటుంది. అందులో మహాత్మగాంధీ, ఏసుక్రీస్తు, గౌతమబుద్ధుడు, మదర్ థెరిస్సా ల ఫోటోలు వరుసగా అలంకరించబడి ఉంటాయి. ఆ ఛాంబర్ లో దేవుళ్ళ ఫోటోలు అస్సలు కన్పించవు. సినిమా స్టిల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అందులో “బలరామకృష్ణులు” చిత్రంలో తన క్యారెక్టర్ పక్కన గొడుగు పట్టిన ఒక జూనియర్ నటుడి ఫోటో అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఫోటో అంటే శోభన్ బాబుకు చాలా ఇష్టం. ఆ ఫొటోలో ఏదో తెలియని దర్పం, హుందాతనం ఉంటాయని శోభన్ బాబు తరచూ అనేవారట. అయితే ఆ చిత్రంలో ఆ సన్నివేశంలో నటించిన ఆ జూనియర్ నటుడు తరువాత చనిపోయారు. ఇక ఆయన టేబుల్ మీద ఆయనకు చాలా ఇష్టమైన మిత్రుల ఫోటోలు తప్పనిసరిగా ఉంటాయి. అందులో ముఖ్యంగా ఎన్టీఆర్ ఫోటో ఉంటుంది.

Shobhan-babu-with-ntr

శోభన్ బాబు ఇంటిముందు చాలా ఖాళీ స్థలం ఉంటుంది. అక్కడ అనేక చెట్లు ఉంటాయి. వాటిని నరికేస్తే అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ నే కట్టొచ్చు. కానీ శోభన్ బాబు ఆ పని చేయలేదు. ఎందుకంటే ఆయనకు చెట్లు అంటే ప్రాణం. ఆయన పర్సనల్ ఛాంబర్ లో ఒక పెద్ద వేప చెట్టు ఉంటుంది. దానికి చుట్టూ రక్షణ కవచం వేసి తన ఛాంబర్ ను నిర్మించుకున్నారు శోభన్ బాబు. ఆయన ఆవరణలో ఎవరైనా చెట్ల ఆకుల్ని, కాయల్ని, పూలను కోసినా… అనవసరంగా చెట్లను తాకినా శోభన్ బాబు ఆగ్రహంతో ఊగిపోతారు. ఇవి శోభన్ బాబు పర్సనల్ ఛాంబర్ లోని సీక్రెట్స్.

Related posts