telugu navyamedia
సినిమా వార్తలు

మా ఊరికి వెళ్లిపోతున్నా… శివాజీరాజా సంచలన వ్యాఖ్యలు

Sivajiraja

“మా” (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో సీనియర్ నటుడు నరేష్ ప్యానల్ చేతిలో శివాజీరాజా ప్యానల్ ఓడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న శివాజీరాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు జరిగే సమయంలో అసోసియేషన్ వ్యవహారాలు మీడియా ముందు ప్రసావించకూడదని నిబంధన ఉన్నప్పటికీ ప్రత్యర్థి ప్యానల్ దాన్ని అతిక్రమించారని, తాను, శ్రీకాంత్ అసోసియేషన్ లో ఎలాంటి అన్యాయాలు, అక్రమాలకు పాల్పడలేదని, మా సభ్యుల్లో చాలామంది తనను తిరిగి నిలబడాలని కోరితేనే పోటీ చేశానని, తనను ఓడించారని, ఇక తన కుటుంబంతో కలిసి ఊరికి వెళ్లిపోతానని తెలిపారు. తనకు ఎవరైనా ఏడవడం ఇష్టం ఉండదని, కానీ తనకోసం శ్రీకాంత్, ఎస్వీ కృష్ణారెడ్డి పడ్డ కష్టం చూసి కన్నీళ్లు ఆగడం లేదని, తాను ఎవరినీ విమర్శించడం లేదని, ప్రత్యర్థి ప్యానల్ చేసిన విమర్శలను ఖండించకుంటే, అవి నిజమని భావించే అవకాశం ఉందని, అందుకే మీడియా సమావేశం పెట్టానని, తనకు తప్పు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ హైదరాబాదులోని ఫిలిం ఛాంబర్ లో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు కొనసాగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 472 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసోసియేషన్ అధ్యక్ష పదవికి శివాజీరాజా, నరేష్ లు పోటీ చేయగా ‘మా’ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ నటుడు నరేష్ గెలుపొందారు. తన ప్రత్యర్థి శివాజీ రాజాపై 69 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొత్తం నమోదైన ఓట్లలో 268 ఓట్లు నరేష్‌కు పోలవగా.. శివాజీ రాజాకు 199 ఓట్లు పడ్డాయి. 69 ఓట్ల ఆధిక్యంతో నరేష్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. జనరల్‌ సెక్రటరీగా జీవిత రాజశేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్‌, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, కోశాధికారిగా రాజీవ్‌ కనకాల, జాయింట్‌ సెక్రటరీగా గౌతమ్‌రాజు, శివబాలాజీ గెలుపొందారు.హేమ ఇండిపెండెంట్ గా పోటీ చేసి కూడా గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా అలీ, రవిప్రకాశ్‌, తనికెళ్ల భరణి, సాయికుమార్‌, ఉత్తేజ్‌, పృథ్వి, జాకీ, సురేశ్‌ కొండేటి, అనితా చౌదరి, అశోక్ కుమార్‌, సమీర్‌, ఏడిద శ్రీరామ్‌, రాజా రవీంద్ర, తనీష్‌, జయలక్ష్మి, కరాటి కల్యాణి, వేణుమాధవ్‌, పసునూరి శ్రీనివాస్‌ విజయం సాధించారు.

Related posts