telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 ప్రపంచ కప్ : స్కోర్ ఎంతైనా .. ఈసారి భయం లేదు..

shami on world cup 2019

భారత సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మహమ్మద్‌ షమీ ప్రపంచకప్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తిప్పలు పెట్టేందుకు తన దగ్గర యార్కర్లు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నాడు. గత రెండేళ్లుగా కుటుంబపరంగా ఎన్నో ఆరోపణలు ఎదురవుతున్నా షమీ మాత్రం కెరీర్‌పైనే దృష్టి పెట్టాడు. ఒకానొక దశలో జట్టులో స్థానం కోల్పోయిన షమీ పునరాగమనం చేసేందుకు రెండేళ్ల పాటు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రస్తుతం భారత జట్టులో కీలక బౌలర్‌గా ఉన్నాడు. ప్రపంచకప్‌లో పాల్గొనడం గురించి మాట్లాడిన షమీ.. ఇంగ్లాండ్‌ గడ్డపై బ్యాట్స్‌మెన్‌ను తిప్పలు పెట్టేందుకు అస్త్రాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నాడు. ‘ఇంగ్లాండ్‌ పిచ్‌లపై 350కి పైగా పరుగులు నమోదుతున్నాయి. అయితే దాని గురించి మా జట్టు బౌలర్లలో ఏమాత్రం భయం లేదు. ఇంగ్లాండ్‌లో ఫ్లాట్‌ పిచ్‌లు బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. బౌలర్లు తెలివిగా బౌలింగ్‌ చేస్తే బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయొచ్చు. పరిస్థితులను బట్టి బౌలింగ్‌ చేయాల్సిన బాధ్యత బౌలర్లదే. భారీ స్కోరు గురించి నేనేమీ ఆలోచించట్లేదు.

పరిస్థితులకు తగ్గట్టుగా నా బౌలింగ్‌లో ఏ మార్పు చేసుకోవాలనే దాన్ని మాత్రమే నమ్ముతాను. ఆఫ్‌స్టంప్‌కు ఆవలగా వేసే బంతులు బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టిస్తాయి. మునుపెన్నడూ లేనంతగా భారత బౌలింగ్‌ బలంగా ఉంది. ప్రస్తుతం ఉన్న బౌలింగ్‌ బృందంతోపాటు జట్టులో ఉండటం ఎంతో గర్వంగా ఉంది. గత కొన్నేళ్లుగా భారత జట్టు సాధించిన విజయాల్లో బౌలర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఒకప్పుడు ఇండియా అంటే బ్యాట్స్‌మెన్‌పైనే ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చేది. రానురాను ఆ పరిస్థితి మారింది. అయితే, ఈ మార్పు రాత్రికిరాత్రి జరిగింది కాదు. ఏళ్ల తరబడి శ్రమకు ఫలితంగా వచ్చిన ప్రతిఫలం. ప్రపంచకప్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను టీమిండియా ఫాస్ట్‌ బౌలర్లు ఇబ్బంది పెడతారనడంలో సందేహం లేదు. భారత జట్టులో బౌలింగ్‌ గురించి విదేశీ క్రికెటర్లు సైతం మాట్లాడుకోవడం గర్వంగా ఉంది’ అని షమీ పేర్కొన్నాడు.

గతంలో షమీ రెండు సంవత్సరాల పాటు వన్డే జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత తిరిగి పుంజుకొని ప్రపంచకప్‌ జట్టులో స్థానం సంపాదించాడు. షమీకి తెలుపురంగు బంతితో మంచి రికార్డు ఉంది. మొన్న జరిగిన ఐపీఎల్‌లోనూ పంజాబ్‌ తరఫున షమీ మంచి బౌలింగ్ ప్రదర్శన కనిబరిచాడు. పొట్టి ఫార్మాట్‌లోనూ మంచి లెంగ్త్‌లో బౌలింగ్‌ వేసి విజయంవంతం అయ్యాడు. కొత్త, పాత తేడా లేకుండా ఏ బంతితోనైనా మంచి పదునైనా వేగంతో పాటు బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేయగల నైపుణ్యం షమీ సొంతం. 2013లో టెస్టు మ్యాచ్‌ ద్వారా భారత జట్టులో అటుగుపెట్టిన షమీ ఇప్పటి వరకూ 40 టెస్టుల్లో 144 వికెట్లు, 63 వన్డేల్లో 113 వికెట్లు తీశాడు. 2015 ప్రపంచకప్‌లో పాల్గొన్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్న షమీ 7 మ్యాచులాడి 17 వికెట్లు తీశాడు.

Related posts