telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గీతాంజలి సినీ ప్రస్థానం… మణి గీతాంజలిగా ఎందుకు మారిందంటే ?

Geethanjali

టాలీవుడ్ సీనియర్ నటి గీతాంజలి గుండెపోటుతో హైదరాబాద్ లోని ఫిలింనగర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. ఆమె మృతితో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగింది. సినీ సెల‌బ్రిటీలు గీతాంజ‌లి మృతికి సంతాపం తెలియ‌జేస్తూ, కుటుంబ స‌భ్యుల‌కి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాష‌ల‌లో దాదాపు 500 చిత్రాల‌కి పైగా న‌టించిన గీతాంజ‌లి అస‌లు పేరు మ‌ణి. 1963లో పారస్‌మణి అనే హిందీ చిత్రంలో నటిస్తుండగా ఆ చిత్ర నిర్మాతలు లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సినిమా టైటిల్లోనూ మణి ఉంది కాబట్టి ఈమెకు గీతాంజలి అని పేరు సూచించారు. దాంతో అప్ప‌టి నుండి గీతాంజ‌లి అని అంద‌రు పిల‌వ‌డం మొద‌లు పెట్టారు.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శ్రీరామమూర్తి, శ్వామసుందరి దంపతులకు 1947లో జన్మించారు గీతాంజ‌లి. కాకినాడలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంటులో కొన్నేళ్లు చదివిన గీతాంజలి ఐదేళ్ల వయసు ఉన్న‌ప్పుడు తన అక్క స్వర్ణతో పాటు గంధర్వ నాట్యమండలిలో లక్ష్మారెడ్డి, శ్రీనివాసన్ ల వద్ద నాట్యం నేర్చుకున్నారు. ఆరో ఏట నుంచి అక్కతో కలిసి నాట్య ప్రదర్శనలు ప్రారంభించారు. బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తన 13వ ఏట హీరోయిన్ అయింది. కెరీర్ తొలినాళ్లలో హీరోయిన్‌గా చేసిన ఆమె జానపద కథనాయికిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1961లో సీతారామ క‌ళ్యాణం చిత్రం ద్వారా వెండితెర ఆరంగేట్రం చేసిన ఆమె సహనటుడు రామకృష్ణని వివాహం చేసుకున్న‌ తర్వాత సినిమాలకు కొంత విరామం ఇచ్చారు. మంచిరోజు, పెళ్ళిరోజు, తోటలోపిల్లా కోటలోరాణి, రాజయోగం, రణభేరి చిత్రాల్లో రామకృష్ణతో కలిసి నటించారు. ఎన్టీఆర్‌ను తన సినీ గురువుగా గీతాంజలి చెప్పుకునేవారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ‘పెళ్లైన కొత్తలో’ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇచ్చారు. గీతాంజలి సీతారామ కల్యాణం, బొబ్బిలి యుద్ధం, ఇల్లాలు, దేవత, లేతమనసులు, తోడు-నీడ, గూఢచారి-116, ప్రాణమిత్రులు, పూలరంగడు, శ్రీకృష్ణావతారం, ఆదర్శకుటుంబం, రణభేరి, నిండు హృదయాలు, మంచిమిత్రులు, డాక్టర్‌ చక్రవర్తి, ఫూల్స్‌ తదితర చిత్రాల్లో నటించారు.

గీతాంజ‌లి చివ‌రిగా త‌మన్నా న‌టించి ద‌టీజ్ మ‌హాల‌క్ష్మీ చిత్రంలో న‌టించారు. ఈ సినిమా విడుద‌ల‌కి సిద్దంగా ఉంది. ఆ మ‌ధ్య ఆలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మంలోను పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో అనేక విష‌యాల‌ని షేర్ చేసుకున్నారు.గీతాంజలి నంది అవార్డు కమిటీ మెంబర్‌గా కూడా పనిచేశారు. రాజ‌కీయాల‌లోను త‌న వంతు కృషి చేశారు. 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు గీతాంజ‌లి.

Related posts