telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ లో “పుల్వామా” ఘటనపై సినిమాకు రంగం సిద్ధం

Sanjay

2016 సెప్టెంబర్‌ 18న జమ్ము కశ్మీర్ యురి సెక్టార్‌ లోని ఆర్మీ స్థావరంపై టెర్ర‌రిస్ట్‌ల ఎటాక్‌కి ప్ర‌తీకారంగా ఇండియ‌న్ ఆర్మీ సెప్టెంబ‌ర్ 29న సర్జిక‌ల్ స్ట్రైక్ జ‌రిపిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌ర్జికల్ స్ట్రైక్ నేప‌థ్యంలో బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఆదిత్య దార్ “యురి” అనే సినిమా చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించింది. ఇక జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఫిబ్రవరి 14న సీఆర్‌పీఎఫ్‌ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. దీనికి ప్రతీకారంగా ఫిబ్ర‌వ‌రి 26న భార‌త వాయిసేన యుద్ధ విమానాల‌తో.. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌ లోని ఉగ్ర స్థావ‌రాల‌పై భీక‌ర దాడులు చేశారు. అదే సమయంలో భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ పాకిస్తాన్‌ చేతికి చిక్కగా, అనూహ్య పరిణామాల తర్వాత తిరిగి భారత్‌కు చేరుకున్నాడు. ఆయ‌న ధైర్యసాహసాలను మెచ్చిన భారత ప్రభుత్వం అభినందన్‌కు ‘వీర్‌చక్ర’ పురస్కారాన్ని అందించింది. ఈ సంఘ‌ట‌నల‌ నేప‌థ్యంలో చిత్రాన్ని తెర‌కెక్కించనున్న‌ట్టు వివేక్ ఒబేరాయ్ గ‌తంలో ప్ర‌క‌టించారు. ఈ సినిమాను కమర్షియల్ పంథాలో తెరకెక్కించబోనని, లాభాలను ఆశించకుండా దేశం గురించి, వైమానిక దళ యుద్ధ శక్తిని దేశ ప్రజలకు కళ్లకు కట్టినట్టుగా తెలియజేయడానికే ‘బాలాకోట్‌- ది ట్రూ స్టోరీ’ పేరుతో సినిమాను నిర్మించ‌నున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.

ఇప్పుడు బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ బాలాకోట్‌కి సంబంధించిన సంఘ‌ట‌న‌ల‌తో చిత్రాన్ని నిర్మిస్తున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. భూషణ్‌ కుమార్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు భ‌న్సాలీ ప్రొడ‌క్ష‌న్స్ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొంది. ‘కేదార్‌నాథ్‌’ దర్శకుడు అభిషేక్‌ కపూర్‌ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడని తెలిపారు. ఈ భారత సైన్య పోరాటాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నామని భూషణ్‌ కుమార్‌ తెలిపారు. భారత ఆర్మీ ధైర్యసాహసాలకు ప్రతీకగా ఈ సినిమా నిర్మితమవుతుందని తెలిపారు. మరి ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Related posts