telugu navyamedia
సినిమా వార్తలు

తల్లిపై సంగీత సంచలన వ్యాఖ్యలు

Sangeetha

సినీనటి సంగీతపై ఆమె తల్లి భానుమతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో సంగీతపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలతో తాజాగా సంగీత తన తల్లిని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో “ప్రియమైన అమ్మా.. నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు.. నన్ను స్కూల్ కి దూరం చేసి 13 ఏళ్ల వయసు నుండే పని చేయించినందుకు థాంక్యూ.. నాతో ఖాళీ చెక్కుల మీద సంతకాలు చేయించినందుకు కృతజ్ఞతలు. మందు, డ్రగ్స్ కి బానిసై జీవితంలో ఏరోజూ పనికి వెళ్ళని నీ కుమారుడి సౌకర్యాల కోసం నన్ను దోపిడీ చేసినందుకు థాంక్స్. నేను పోరాడే వరకూ నాకు పెళ్లి చేయకుండా ఉన్నందుకు థాంక్స్. నన్ను, నా భర్తని రోజూ వేధిస్తూ మా కుటుంబ ప్రశాంతతను దూరం చేసినందుకు థాంక్స్. ఓ తల్లి ఇలా ఉండకూడదని నాకు తెలియజేసినందుకు థాంక్స్. చివరిగా నువ్వు చేసిన తప్పుడు ఆరోపణలకు థాంక్స్. నీకు తెలిసో.. తెలియకో.. నోరులేని అమ్మాయి నుండి పోరాడే మహిళగా మారేలా చేశావు. ఈ విషయంలో నువ్వు నాకు నచ్చావ్.. ఏదోక రోజు నీ పొగరు పక్కన పెట్టి నన్ను చూసి కచ్చితంగా గర్వపడతావు” అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

తమిళనాడు రాజధాని చెన్నైలోని వలసరవాక్కంలో సినీనటి సంగీత తల్లి భానుమతికి రెండంతస్థుల ఇల్లు ఉంది. కింది పోర్షన్ లో భానుమతి నివసిస్తుండగా, పై పోర్షన్ లో సంగీత, క్రిష్ దంపతులు ఉంటున్నారు. అయితే మామగారి నుంచి భానుమతికి సంక్రమించిన ఈ ఆస్తి ఇప్పుడు సంగీత పేరున ఉంది. దీంతో ప్రస్తుతం తన కూతురు సంగీత తనను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చేస్తోందంటూ భానుమతి ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఆమె మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయగా… భానుమతి ఫిర్యాదును స్వీకరించిన మహిళా కమిషన్ సంగీతకు నోటీసులు జారీ చేసింది. దీంతో మూడ్రోజుల క్రితం సంగీత తన భర్తతో కలిసి మహిళా కమీషన్ ఎదుట హాజరై ఈ విషయంపై వివరణ ఇచ్చారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించిన సంగీత పదేళ్ల క్రితం క్రిష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. 2012లో వీరికొక ఆడబిడ్డ జన్మించింది.

Related posts