telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“జాను” మా వ్యూ

Jaanu

బ్యాన‌ర్‌ : శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
న‌టీన‌టులు : శ‌ర్వానంద్‌, సమంత‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, వెన్నెల కిషోర్‌, ర‌ఘుబాబు, తాగుబోతు ర‌మేశ్‌ త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం : సి.ప్రేమ్‌కుమార్‌
పాట‌లు : సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, శ్రీమ‌ణి
సినిమాటోగ్ర‌ఫీ : మ‌హేంద్ర‌న్ జ‌య‌రాజ్‌
సంగీతం : గోవింద్ వ‌సంత‌
నిర్మాత‌లు : దిల్‌రాజు, శిరీష్‌

గ‌త ఏడాది త‌మిళంలో క్లాసిక్ మూవీగా విడుదలై భారీ హిట్ ను సొంతం చేసుకున్న చిత్రం ‘96’. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన 17 ఏళ్ల కెరీర్‌లో చేస్తున్న మొట్ట మొదటి రీమేక్ సినిమా ఇది. అంతే కాకుండా విజ‌య్ సేతుప‌తి, త్రిష హీరో హీరోయిన్లుగా త‌మిళంలో రూపొందిన ‘96’ను తెలుగులో శర్వానంద్, సమంతలతో ‘జాను’గా రీమేక్ చేశారు. మ‌రి ‘జాను’ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఏమేర‌కు ఆక‌ట్టుకుంది? శ‌ర్వానంద్‌, స‌మంత తెలుగులో మ్యాజిక్ క్రియేట్ చేశారా ? లేదా ? అనేది తెలుసుకుందాం.

కథ :
కె.రామచంద్ర‌ (శ‌ర్వానంద్‌) ట్రావెల్ ఫొటోగ్రాఫ‌ర్‌. ఫోటోగ్రఫీ పనిమీద త‌న స్టూడెంట్‌తో వైజాగ్ వ‌చ్చిన రామ‌చంద్రకు అక్క‌డ తన గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. దీంతో త‌న‌తోపాటు 10వ త‌ర‌గ‌తి చ‌దువుకున్న ముర‌ళి, స‌తీష్‌ ల‌కు ఫోన్ చేసి మాట్లాడుతాడు. అంద‌రూ మాట్లాడుకుని హైద‌రాబాద్‌లో రీ యూనియ‌న్ కావాల‌నుకుంటారు. అన్న‌ట్లుగానే అంద‌రూ క‌లుసుకుంటారు. అప్పుడు రామ‌చంద్ర‌, జానకి దేవి (స‌మంత)ని క‌లుసుకుంటాడు. దాదాపు 17 సంవ‌త్స‌రాలు త‌ర్వాత క‌లుసుకున్న ఇద్ద‌రూ రీ యూనియ‌న్ పార్టీ త‌ర్వాత తమ ప్రేమకు సంబంధించిన గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటారు. అయితే అప్పటికే జానుకి పెళ్లై ఉంటుంది. కానీ రామ‌చంద్ర మాత్రం ఇంకా పెళ్లి చేసుకోడు. రామ‌చంద్ర పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి ? అప్పట్లో రామ‌చంద్ర‌, జాను ఎందుకు విడిపోయారు ? చివరికి ఏం జరిగింది ? అనే విష‌యాలు తెలియాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
రామ్ పాత్ర‌లో శ‌ర్వా, జానకి పాత్ర‌లో స‌మంత ఒదిగిపోయారు. ఫీల్‌ను బాగా క్యారీ చేశారు. అయితే తమిళ సినిమాను, తెలుగు సినిమాను పోల్చడం, లేదా శర్వానంద్, విజయ్ సేతుపతి… త్రిష సమంత నటనను పోల్చడం కష్టము. ఎవరికి వారే సాటి… ఇక ఈ తెలుగు రీమేక్ లో మాత్రం సమంత, శర్వా నటన అందరినీ ఆకట్టుకుంటుంది. తణికెళ్లభరణి, వెన్నెల‌కిషోర్‌, తాగుబోతు ర‌మేష్‌, ర‌ఘుబాబు, సాయికిర‌ణ్‌, గౌరి తమ పాత్రల పరిధిమేరకు నటించి ప్రేక్షకులను కట్టిపడేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :
రీమేక్ సినిమాలను తెరకెక్కించడమే కష్టమంటే… ఇక క్లాసిక్ సినిమాను రీమేక్ చేయడం కత్తిమీద సాములాంటిది. కొంతమంది ప్రేక్షకులకు కొన్ని స‌న్నివేశాలు మ‌న‌సుని తాకుతాయి. అయితే సినిమాలో స్లోగా సాగడం లాంటి కొన్ని మైనస్ లు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ప్రేమికులను ఈ సినిమా ఎమోషనల్ గా టచ్ చేస్తుంది. మ‌హేంద్ర‌న్ సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. గోవింద్ వ‌సంత సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశాల‌ను మ‌రో రేంజ్‌లో నిలిపాయి. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి.

రేటింగ్ : 3/5

Related posts