telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత్‌ కోసం పుజారా ఎంతో సాధించాడు : సచిన్

భారత్ విజయాల్లో పుజారా బ్యాటింగ్‌ శైలి అంతర్భాగమన్నారు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. విమర్శకులు అతడికి కనీసం చేరువలో లేరని పేర్కొన్నారు. టెస్టు క్రికెట్లో స్ట్రైక్‌రేట్‌ మాత్రమే ముఖ్యం కాదన్నారు. అవసరమైతే నిలబడి బౌలర్లను అలసిపోయేలా చేయాల్సి ఉంటుందని సచిన్ చెప్పారు. జూన్‌ 18న ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం భారత్, న్యూజిలాండ్‌ జట్లు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌లో ఎలా ఆడాలో టీమిండియా క్రికెటర్లకు క్రికెట్ దిగ్గజం సూచనలిచ్చారు. తాజాగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ… ‘భారత్‌ కోసం చెతేశ్వర్‌ పుజారా ఎంతో సాధించాడు. అందుకు పుజారాను ప్రశంసించాలి. టెస్ట్ ఫార్మాట్లో ప్రతిసారీ స్ట్రైక్‌రేట్ ప్రధానం కావు. టెస్టుల్లో విజయాలు అందుకోవాలంటే భిన్నమైన ఆటగాళ్లు, ప్రణాళికలు జట్టుకు అవసరం. చేతిలోని ఐదు వేళ్లలాగే ఇదీ. ప్రతి వేలికీ ఓక్కో పాత్ర ఉంటుంది. అదే విధంగా జట్టులో పుజారా అంతర్భాగం. అతడి ప్రతి ఇన్నింగ్స్‌నూ విశ్లేషించడం మానేసి.. దేశం కోసం సాధించినవాటికి మెచ్చుకోవాలి. పుజారా టెక్నిక్‌, రొటేషన్‌ గురించి నిత్యం ప్రశ్నించేవాళ్లు.. అతడిలా అత్యున్నత స్థాయి క్రికెట్‌ కనీసం ఆడి ఉండరు’ అని సచిన్ అన్నారు.

Related posts