telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సమ్మె ముగిసినా.. డిపోల వద్ద ఉద్రిక్తతలు..

rtc strike buses

ఆర్టీసీ కార్మికుల 52 రోజుల ఆందోళనకు తెరపడింది. డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెను బేషరతుగా విరమించారు కార్మికులు. సమ్మె విరమిస్తున్నామని సోమవారం (నవంబర్ 25,2019) సాయంత్రం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సంచలన ప్రకటన చేశారు. మంగళవారం(నవంబర్ 26,2019) నుంచి కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తాము సమ్మె విరమించినందున తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరు కావొద్దని కోరారు. నైతిక విజయం తమదేనని చెప్పారు. దశల వారీగా తమ పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. సమ్మె విరమణ ప్రకటనతో ఆర్టీసీ కార్మికులు… మంగళవారం ఉదయం నుంచి విధుల్లో చేరేందుకు ఒక్కొక్కరుగా డిపోలకు చేరుకుంటున్నారు. అయితే.. వారిని విధుల్లో చేర్చుకునేది లేదని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించడంతో… అధికారులు వారిని వెనక్కి పంపిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదని తిప్పి పంపేస్తున్నారు. కొన్ని చోట్ల తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను అడ్డుకున్న కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ముందుజాగ్రత్తగా రాష్ట్రంలోని అన్ని డిపోల దగ్గర పటిష్ట బందోబస్తు కల్పించారు. కార్మికులు ఆందోళనకు దిగకుండా, తాత్కాలిక ఉద్యోగులను అడ్డుకోకుండా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించింది ప్రభుత్వం. ప్రస్తుతం డిపోలకు చేరుకున్న వారి సంఖ్య స్వల్పంగానే ఉన్నా… సమయం గడిచేకొద్ది ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయోనన్న ఆందోళన నెలకొంది. డిమాండ్ల సాధనకు ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మెను ఉధృతంగా కొనసాగిస్తామని తొలుత భీష్మించుకొని కూర్చున్న కార్మిక సంఘాల జేఏసీ… ఆ తర్వాత పరిస్థితిని బట్టి మెట్టు దిగుతూ వచ్చింది. సమస్య జటిలమై చివరకు కార్మికులు ఇబ్బంది పడే పరిస్థితి రావొద్దన్న ఉద్దేశంతో పట్టు వీడింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమనే ప్రధాన డిమాండ్‌ను సైతం తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత ఏకంగా సమ్మె విరమణ అంశాన్ని ప్రస్తావించింది.

కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మెను విరమించేందుకు సిద్ధమని ప్రకటించింది. సడక్‌ బంద్‌ను కూడా విరమించింది. ఈ రెండు సందర్భాల్లో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని జేఏసీ ఆశించింది. కానీ కార్మిక సంఘాలు మెట్టు దిగినా ప్రభుత్వం మాత్రం బెట్టు వీడలేదు. దీంతో ఏకంగా సమ్మెనే విరమిస్తున్నట్లు జేఏసీ ప్రకటించినా ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన మాత్రం రాలేదు. 2019 నవంబర్ 4వ తేదీ అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దసరా పండుగ సమయంలో సమ్మెలోకి వెళ్లడాన్ని కేసీఆర్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వేగం చేసింది. తాత్కాలికంగా డ్రైవర్లను, కండక్టర్లను నియమించి బస్సులను నడిపించే ప్రయత్నం చేసింది. త్రిసభ్య కమిటీ వేసి..చర్చలు జరిపినా..అవి విఫలమయ్యాయి. రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అన్ని అంశాలను చర్చించి ఆర్టీసీపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే 5వేల 100 ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. హైకోర్టు తీర్పు దీనికి అనుకూలంగా వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంఠ ఉంది.

Related posts