telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

మేము సమర్థులం.. అందుకే ఎదుటివారి సమర్థతను గుర్తించగలం.. : రోహిత్ శర్మ

rohit sharma very near to another world record

వెస్టిండీస్‌ జట్టు కీరన్‌ పొలార్డ్‌ సారథ్యంలో చక్కగా ఆడుతుందని టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. ముఖ్యంగా పొలార్డ్‌ కెప్టెన్సీని కొనియాడాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)తో పొలార్డ్‌ సామర్థ్యం, ఆలోచనల గురించి క్షుణ్ణంగా తెలుసన్నాడు. ఇక గత సీజన్‌లో తాను గైర్హాజరీ నేపథ్యంలో ఓ మ్యాచ్‌కు పొలార్డ్‌ సారథ్యం వహించాడని, ఆ సమయంలో అతడి వ్యూహాలు, గెలవాలనే తపన, ఫీల్డ్‌లో ఆటగాళ్లను సరిగ్గా సద్వినియోగం చేసుకునే తీరును దగ్గర్నుంచి చూశానని పేర్కొన్నాడు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు అతడు చాలా ఆత్మవిశ్వా​సంతో, సహచర ఆటగాళ్లపై ఎంతో నమ్మకంగా వ్యవహరిస్తాడన్నాడు. టీ20ల్లో విండీస్‌ అనూహ్యమైన జట్టని, ప్రతీ ఒక్క ఆటగాడు క్షణాల్లో ఆటను పూర్తిగా మార్చగలరని ప్రశంసించాడు. అయితే మేము ఏ జట్టుకు భయపడమని రోహిత్‌ స్పష్టం చేశాడు.

వెస్టిండీస్‌ చాల అనూహ్యమైన జట్టు. టీ20ల్లో అసాధారణ రీతిలో ఆడుతోంది. ముఖ్యంగా పొలార్డ్‌ సారథ్యంలోని ఆ జట్టు చాలా పరిణితి చెందుతోంది. ఆ జట్టులోని దాదాపు అందరాటగాళ్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని టీ20లు ఆడుతున్నారు. దీంతో ఈ ఫార్మట్‌లో వారు విశేషంగా రాణిస్తున్నారు. ఒక విషయాన్ని మనం పరిశీలిస్తే ప్రతి రెండు బంతులకో ఒక సిక్సర్‌ కొట్టడానికి వారు ప్రయత్నిస్తుంటారు. దీంతో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ అంటే చాలెంజింగ్‌గా తీసుకున్నాం. ఎందుకంటే ఆ జట్టులో పవర్‌ హిట్టర్లు ఉన్నారు. ఈ తరుణంలో బౌలర్లకు పెద్ద పరీక్ష వంటిది. అయితే మేము ఏ జట్టుకు భయపడం. మా ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తే మేమే గెలుస్తాం. అయితే మాకంటే వారి ప్రణాళికలు గొప్పగా ఉంటే వారే గెలుస్తారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో వారి ప్రదర్శన చాలా గొప్పగా ఉంది. హైదరాబాద్‌ మ్యాచ్‌లో కోహ్లి సహాయంతో టీ20ల్లో భారీ స్కోర్‌ను ఛేజ్‌ చేశాం. అయితే రెండో మ్యాచ్‌లో చతికిలపడ్డాం. ఆ మ్యాచ్‌లో అనేక పొరపాట్లు చేశాం. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో పూర్తిగా వైఫల్యం చెందాం. ముందగా ప్రత్యర్థి జట్టు ముందు భారీ స్కోర్‌ ఉంచలేకపోయినప్పటికీ పోరాడే స్కోరే సాధించాం. కానీ బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో విఫలమవ్వడంతో ఓటమి చవిచూశాం. ఈ లోపాలన్ని సరిదిద్దుకొని నిర్ణయాత్మకమైన మూడో టీ20 కోసం బరిలోకి దిగుతాం. సిరీస్‌ సాధిస్తామనే విశ్వాసం మాకు ఉందంటూ రోహిత్‌ పేర్కొన్నాడు.

Related posts