telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్‌ ని రద్దు చేసి బీసీసీఐ మంచి పని చేసింది : రోహిత్

ఐపీఎల్ జట్లలో కరోనా కేసులు రావడంతో ఐపీఎల్ 2021ని బీసీసీఐ మంగళవారం నిరవధిక వాయిదా వేసిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్‌ శర్మ మాట్లాడిన వ్యాఖ్యలను షేర్‌ చేసింది. ఈ వీడియోలో రోహిత్‌తో పాటు జస్ప్రీత్ బుమ్రా, ఆడమ్‌ మిల్నే, జయంత్‌ యాదవ్‌, షేన్‌ బాండ్‌, రాబిన్‌ సింగ్‌ కూడా ఉన్నారు. ‘ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఐపీఎల్‌ 2021ని రద్దు చేసి బీసీసీఐ మంచి పని చేసింది. దేశం మొత్తం కరోనాతో అతలాకుతులమవుతున్న సమయంలో ఐపీఎల్‌ ద్వారా కాస్త ఉపశమనం కలిగిద్దాం అని భావించాం. దురదృష్టవశాత్తూ బయో బబూల్‌ సెక్యూర్‌లో ఉన్న మాకు కూడా కరోనా సెగ తగిలింది. ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుంటే.. లీగ్‌ నిర్వహించడం కష్టతరమవుతుంది. ఇలాంటి సమయంలో లీగ్‌ను వాయిదా లేదా రద్దు చేయడమే సరైన పని. బీసీసీఐ సరైన నిర్ణయమే తీసుకుంది’ అని రోహిత్ అన్నాడు. ‘ఐపీఎల్‌ 2021లో ఇంతవరకు జరిగిన మ్యాచ్‌లకు మీరు ఇచ్చిన సహకారం మరువలేనిది. పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ ఐపీఎల్‌ను నిర్వహిస్తారని ఆశిస్తున్నా. మనం మళ్లీ కలిసేవరకు దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి అని సూచించాడు.

Related posts