telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ కు బుద్ధిచెప్పే సమయం ఇదే… హుజుర్ నగర్ ప్రచారంలో రేవంత్ రెడ్డి..

revanthreddy campaign in huzurnagar

హుజుర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సీఎం కేసీఆర్ సభ రద్దు కావడం.. ఎంపీ రేవంత్ రెడ్డి రోడ్ షో విజయవంతం కావడంతో రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ టార్గెట్‌గా రేవంత్ రెడ్డి సంధించిన మాటల తూటాలు బాగానే పేలినట్లు కనిపించింది. రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాటకు ఈలలు వేస్తూ చప్పట్లు కొట్టారు. ఆర్టీసీ కార్మికులు అడ్డుకుంటే తన పరువు పోతుందనే భయంతో హుజుర్ నగర్ సభకు కేసీఆర్ రాలేదని ఎద్దేవా చేశారు రేవంత్. ప్రభుత్వం దిగి రావాలంటే.. కేసీఆర్ అహం తగ్గాలంటే టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గం పాలకవీడు మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షో లో రేవంత్ రెడ్డి రోడ్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వం టార్గెట్‌గా ఆయన సంధించిన ఆరోపణాస్త్రాలు జనాలను బాగానే ఆకట్టుకున్నట్లు కనిపించింది. ఒక్కో మాటను తూటాల్లా వదిలారు రేవంత్ రెడ్డి. ఆర్టీసీ కార్మికులు తనను అడ్డుకుంటే ఇజ్జత్ పోతుందనే భయంతో హుజుర్ నగర్ సభ క్యాన్సిల్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. మూడు అడుగులోడు, ఆరు అడుగులోడు ప్రలోభాలకు గురిచేస్తే.. ఎంతిస్తే అంత తీసుకోండని.. ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరారు.

హుజుర్ నగర్ ఒక్క సీటు గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం ఏమీ లేదు.. కానీ కేసీఆర్ గుండెల్లో భయం పుట్టేలా ఈ ఉప ఎన్నిక గుణపాఠంలా మారాలని కోరారు. సీఎం కుర్చీలో కూర్చుని ఫోజు కొట్టడం కాదని.. ఒంట్లో భయం పెట్టుకుని నాలుగున్నర కోట్ల మంది ప్రజలకు సేవ చేసేలా ఆయన అహంకారం తగ్గాలంటే హుజుర్ నగర్ ప్రజల తీర్పుపై అది ఆధారపడి ఉందని వ్యాఖ్యానించారు. హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానంలో అధికార పార్టీ ఎమ్మెల్యే లేనందుకే అభివృద్ధి జరగడం లేదంటున్న కేటీఆర్ సన్నాసి.. నల్గొండ, నాగార్జున సాగర్, కోదాడ, సూర్యాపేటలో మీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే కదా ఉంది.. మరి ఆ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే.. కేసీఆర్‌కు బుద్ది రావాలంటే.. తెలంగాణ ప్రజలకు అరాచక ప్రభుత్వం నుంచి విముక్తి కలగాలంటే.. హుజుర్ నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని తిప్పి కొట్టాలని సూచించారు. ఇక్కడ కారు ఓడిపోయిందంటే తెలంగాణ ప్రజలు విజయం సాధించినట్లేని వ్యాఖ్యానించారు. తెలంగాణ యువకుల కోసం, తెలంగాణ నిరుద్యోగుల కోసం, తెలంగాణ అమరవీరుల కోసం, తెలంగాణ రైతాంగం కోసం చెబుతున్నా.. టీఆర్ఎస్ పార్టీని ఈ ఉప ఎన్నికలో మట్టి కరిపించాలని కోరుతున్నా అంటూ భావోద్వేగంగా మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఈ కసాయి ప్రభుత్వానికి యాభై వేల ఆర్టీసీ కార్మికుల గోస కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

Related posts