telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ విలక్షణ నటుడు సంజీవ్‌ కుమార్‌ వర్ధంతి

Sanjeev-Kumar

ఒక విలక్షణమైన నటుడు. రంగస్థలం అంటే అతనికి ప్రాణం. మంచి భోజన ప్రియుడు కూడా. సినిమాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్న సమయంలో రాజశ్రీ సంస్థ వారు జరిపిన స్కీన్ర్‌ టెస్ట్‌లో విఫలమయ్యాడు. అతడే ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడుగా రెండుసార్లు ‘భారత్‌’ అవార్డులను అందుకోవడం విశేషం. ఆయనే సంజీవ్‌కుమార్‌. బాలీవుడ్‌లో ప్రవేశించిన తొలిరోజుల్లో లఘు బడ్జెట్‌ సి-గ్రేడ్‌ చిత్రాల్లో నటించాడు. 1965లో ‘నిషానా’ సినిమాతో హీరో అవతారమెత్తిన సంజీవ్‌ కుమార్‌ అచిరకాలంలోనే ‘ఖిలోనా’ వంటి విభిన్న సినిమాల్లో అద్భుత నటనా వైదుష్యాన్ని చూపి, భవిష్యత్‌ ప్రస్థానానికి పునాదులు నిర్మించుకున్నాడు. రాజిందర్‌ సింగ్‌ బేడి నిర్మించిన ‘దస్తక్‌’ సినిమా ఉత్తమ కథానాయకునిగా సంజీవ్‌ కుమార్‌కు జాతీయపురస్కారాన్ని అందించింది. తరువాత గుల్జార్‌ దర్శకత్వం వహించిన ‘కోషిష్‌’, ‘పరిచయ్‌’ సినిమాలు విభిన్న పాత్రలను ప్రసాదించి సంజీవ్‌ కుమార్‌లోని అసలు సిసలైన నటుణ్ణి వెలికి తీశాయి. గుల్జార్‌ పర్యవేక్షణలోనే వచ్చిన ‘ఆంధీ’, ‘మౌసమ్’ సినిమాలు సంజీవ్‌ కుమార్‌ నట ప్రస్థానాన్ని సుస్థిరం చేశాయి. ఇక ‘షోలే’ సినిమాలో ఠాకూర్‌ బలదేవ్‌ సింగ్‌ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. అయితే ఆరోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోక 47 సంవత్సరాలకే బ్రహ్మచారిగా మిగిలి తనువు చాలించాడు. ఆ విశిష్ట నటుడి వర్థంతి సందర్భంగా సంజీవ్‌ కుమార్‌ బాలీవుడ్‌ నటనా ప్రస్థాన్నాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం.

 Sanjeev-Kumar

నాటక రంగం నుంచి….
సంజీవ్‌ కుమార్‌ అసలు పేరు హరిహర్‌ జేత్‌ లాల్‌ జరీవాలా. పుట్టింది జూలై 9, 1938న గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌ పట్టణంలో. ముద్దుగా అందరూ అతణ్ణి హరిభాయ్‌ అని పిలిచేవారు. సంజీవ్‌ కుమార్‌ బాల్యం సూరత్‌లోనే గడిచింది. తరువాత వారి కుటుంబం బొంబాయిలో స్థిరపడింది. ఒకసారి సంజీవ్‌ కుమార్‌ ఫిలిం స్కూల్‌కు వెళ్లినప్పుడు నటన మీద ఆసక్తి పెరిగింది. ఇండియన్‌ పీపుల్‌ థియేటర్‌ అసోసియేషన్లో చేరి నటన మీద శిక్షణ తీసుకున్నాడు. ఆ అనుభవంతో కొన్ని రంగస్థల నాటకాలు, నాటికల్లో వేషాలు వేస్తూ వచ్చాడు. తరువాత ఇండియన్‌ నేషనల్‌ థియేటర్‌లో చేరి, నాటకాల్లో వయసు మళ్లిన పాత్రలు కూడా పోషిస్తూ వచ్చాడు. ఇరవై రెండేళ్ల ప్రాయంలో ఆర్థర్‌ మెయిల్స్‌ నాటకం ‘ఆల్‌ మై సన్స్‌’లో ముసలివాని వేషం ధరించాడు. తరువాత ఎ.కె. హంగల్‌ దర్శకత్వంలో ‘దమ్రు’ అనే నాటకంలో అరవయ్యేళ్ల వృద్ధుని పాత్ర పోషించి మెప్పించాడు. బాలీవుడ్‌ ప్రవేశం చిన్న చిన్న పాత్రలు పోషించడంతో మొదలైంది. 1952లో శశిధర్‌ ముఖర్జీ బెంగాలి సినిమా ‘బసు పరివార్‌’ చిత్రాన్ని హిందీలో ‘హమ్‌ హిందుస్తానీ’ పేరుతో పునర్నిర్మించారు. సునీల్‌ దత్, ఆశాపరేఖ్‌ జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా సంజీవ్‌ కుమార్‌ బాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఇతనితోపాటే ప్రేమ్‌ చోప్రా కూడా వెండితెరకు పరిచయమయ్యాడు. అయితే సినిమా గొప్పగా ఆడలేదు. హీరోగా హిందీ సినిమాలో పరిచయం కావడానికి సంజీవ్‌ కుమార్‌కు ఐదేళ్లు పట్టింది. 1965లో హోమివాడియా ‘నిషాన్‌’ చిత్రాన్ని నిర్మించాడు. నాజిమా సరసన నటించిన ఈ సినిమా పరాజయం పాలయింది. తరువాతి సంవత్సరం హోమివాడియా ‘ఆలీబాబా అవుర్‌ 40 చోర్‌’ అనే ఫాంటసీ చిత్రాన్ని నిర్మించాడు. తెలుగు తార ఎల్‌.విజయలక్ష్మి అందులో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం యావరేజిగా నడిచింది. తరవాత ‘స్మగ్లర్‌’, ‘పతి పత్ని’, ‘హుస్న్‌ అవుర్‌ ఇష్ఖ్‌’, ‘బాదల్‌’ వంటి సినిమాల్లో నటించినా సంజీవ్‌ కుమార్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు.

Sanjeev-Kumar

హీరోగా నిలదొక్కుకుంటూ…        
1967లో సావన్‌ కుమార్‌ నిర్మించిన ‘నౌనిహాల్‌’ సినిమాలో హీరోగా ఇంద్రాణి ముఖర్జీ సరసన సంజీవ్‌ కుమార్‌ నటించాడు. ఇందులో మదన్‌ మోహన్‌ స్వరపరచిన ‘మేరి ఆవాజ్‌ సునో… ప్యార్‌ కా రాజ్‌ సునో’ అనే రఫీ ఆలపించిన పాట బాగా హిట్టయింది. దిలీప్‌ కుమార్, వైజయంతిమాల నటించిన ‘సంఘర్ష్‌’ చిత్రంలో సంజీవ్‌ కుమార్‌ నెగటివ్‌ పాత్ర పోషించాడు. అందులో సంజీవ్‌ కుమార్‌కు గుర్తింపు వచ్చింది. ఇక ఆత్మారామ్‌ నిర్మించిన మిస్టరీ సినిమా ‘షికార్‌’లో ధర్మేంద్ర, ఆశాపరేఖ్‌ జంటగా నటించగా, సంజీవ్‌ కుమార్‌ పోలీస్‌ ఇనస్పెక్టర్‌గా నటించారు. ఇందులో నటనకు సంజీవ్‌ కుమార్‌కు ఉత్తమ సహాయ నటుడిగా తొలి ఫిలింఫేర్‌ బహుమతి లభించింది. 1954లో తెలుగులో బి.ఎ. సుబ్బారావు నిర్మించిన ‘రాజు-పేద’ సినిమాను ఎల్‌.వి. ప్రసాద్‌ ప్రత్యగాత్మ దర్శకత్వంలో ‘రాజా అవుర్‌ రంక్‌’ (1968) పేరుతో పునర్నిర్మించారు. ఈ సినిమాలో సంజీవ్‌ కుమార్‌ సుధీర్, విజయ్‌ అనే రెండు పాత్రలు సమర్ధవంతంగా పోషించారు. లక్ష్మికాంత్‌ ప్యారేలాల్‌ సంగీతం సమకూర్చిన ‘మేరా నామ్‌ హై చమేలి’, ‘తు కితనీ అచ్ఛి పై’, ‘ఓ ఫిర్కివాలీ తు కల్‌ ఫిర్‌ ఆనా’ పాటలు సూపర్‌ హిట్‌ కావడంతోను, కథలో మంచి బిగువుండడంతోనూ సినిమా సూపర్‌ హిట్టయింది. 1968లోనే ఎ.భీమ్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ‘గౌరి’ సినిమాలో సునీల్‌ దత్‌తోబాటు సంజీవ్‌ కుమార్‌ సెకండ్‌ హీరోగా నటించారు. అసిత్‌ సేన్‌ దర్శకత్వం వహించిన ‘అనోఖి రాత్‌’లో సంజీవ్‌ కుమార్‌ హీరో. ఈ సినిమా విజయవంతమై నాలుగు ఫిలింఫేర్‌ బహుమతులు కూడా గెలుచుకుంది. హృషికేష్‌ ముఖర్జీ నిర్మించిన ‘ఆశీర్వాద్‌’ సినిమాలో డాక్టర్‌గా సంజీవ్‌ కుమార్‌ నటించారు. ఈ చిత్రం ఉత్తమ హిందీ చిత్రంగా జాతీయ బహుమతి అందుకుంది. ఇందులో అశోక్‌ కుమార్‌ నటనకు అటు జాతీయ బహుమతి, ఇటు ఫిలింఫేర్‌ బహుమతి కూడా లభించాయి. సినిమా విజయవంతమైంది. ‘సచ్చాయి’, ‘సత్యకామ్‌’, ‘ధర్తీ కహే పుకార్‌ కే’ సినిమాల్లో సహాయనటుడిగా, ‘మా కా ఆంచల్‌’, ‘ప్రియ’ వంటి సినిమాలలో హీరోగా నటించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నా సినిమాలు మాత్రం అంతంత మాత్రంగానే ఆడాయి.

Sanjeev-Kumar

దశ మార్చిన ఖిలోనా, దస్తక్‌…
1963లో ప్రసాద్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌ సంస్థ ప్రత్యగాత్మ దర్శకత్వంలో నిర్మించిన ‘పునర్జన్మ’ సినిమాని హిందీలో ఎల్‌.వి. ప్రసాద్‌ ‘ఖిలోనా’(1970) పేరుతో పునర్నిర్మించారు. చందర్‌ వోహ్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంజీవ్‌ కుమార్, ముంతాజ్‌ ముఖ్యపాత్రలు పోషించారు. లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ అద్భుతమైన సంగీతం సమకూర్చారు. తెలుగులో యావరేజ్‌గా ఆడిన ఈ క్లాసిక్‌ హిందీలో బాక్సాఫీస్‌ హిట్టై సంజీవ్‌ కుమార్‌ను హీరోగా నిలబెట్టింది. ఫిలింఫేర్‌ బహుమతుల కోసం ఏకంగా ఆరు నామినేషన్లు పొంది వాటిలో రెంటిని (ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి) గెలుచుకుంది. ఉత్తమ నటుడుగా సంజీవ్‌ కుమార్‌ పేరు ప్రతిపాదనకు వచ్చినా, ఆ బహుమతి ‘సచ్చా ఝూటా’లో నటించిన రాజేష్‌ ఖన్నా పరమైంది. మహమ్మద్‌ రఫీ ఆలపించిన ‘ఖిలోనా జాన్కర్‌ తుమ్‌ క్యో’, ‘ఖుష్‌ రహే తూ సదా’ పాటలు ఇప్పటికీ అనేక చానళ్లలో వినిపిస్తూనే వుంటాయి. తరువాత ప్రముఖ రచయిత రాజిందర్‌ సింగ్‌ బేడి దర్శకనిర్మాణంలో వచ్చిన ‘దస్తక్‌’ (1970) సినిమాలో నూతన తార రెహనా సుల్తానా సరసన సంజీవ్‌ కుమార్‌ హీరోగా నటించారు. ఇందులోనే అతనికి ఉత్తమ నటుడుగా తొలి జాతీయ బహుమతి ‘భరత్‌’ అవార్డు లభించింది. రెడ్‌ లైట్‌ యేరియాలో నూతన దంపతులు ఇల్లు అద్దెకు తీసుకొని పడిన పాట్లను అద్దంలో చూపించిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకనిర్మాత హృషికేష్‌ ముఖర్జీ ఎడిటర్‌గా పనిచేయగా, మదన్‌ మోహన్‌ అద్భుత సంగీతాన్ని సమకూర్చారు. రెహనా సుల్తానాకు ఉత్తమ నటిగా ‘ఊర్వశి’ అవార్డు, మదన్‌ మోహన్‌కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారాలు లభించాయి. ఛాయాగ్రాహకుడు కమల్‌ బోస్‌కు ఫిలింఫేర్‌ బహుమతి లభించింది. తరువాత బాసు భట్టాచార్య నిర్మించిన ‘అనుభవ్‌’ సినిమాలో సంజీవ్‌ కుమార్‌ తనూజ సరసన నటించారు. నరేష్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ‘ఏక్‌ పహేలి’ చిత్రంలో ఫిరోజ్‌ ఖాన్‌తోబాటు; అలాగే తాపీ చాణక్య దర్శకత్వం వహించిన ‘శుభా-ఓ-షామ్’ అనే ఇండో-ఇరానియన్‌ సినిమాలో మహమ్మద్‌ ఆలి ఫర్దిన్‌ (ఇరాన్‌ నటుడు)తోబాటు రెండవ హీరోగా సంజీవ్‌ కుమార్‌ నటించారు. రెండవ హీరోగా సంజీవ్‌ కుమార్‌ రాణించిన చిత్రం జి.పి.సిప్పీ నిర్మించిన ‘సీతా అవుర్‌ గీతా’ (రామానాయుడు ‘రాముడు-భీముడు’, విజయావారి ‘రామ్‌ అవుర్‌ శ్యామ్’, ‘గంగ-మంగ’ చిత్రాల సమ్మిళిత నేపథ్యంలో). ఇందులో ధర్మేంద్ర, సంజీవ్‌ కుమార్‌ హీరోలు కాగా హేమామాలిని ద్విపాత్రాభినయం చేసింది. సినిమా బాక్సాఫీస్‌ హిట్టయింది. తరువాత గుల్జార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కోషిష్‌’ సినిమా సంజీవ్‌ కుమార్‌కు ఉత్తమ నటుడిగా జాతీయ బహుమతి తెచ్చిపెట్టింది. భారతీయ సినీ చరిత్రలో ఈ సినిమాను ఒక మైలురాయిగా సినీ విమర్శకులు కీర్తించారు. గుల్జార్‌ కథను సమకూర్చగా మదన్‌ మోహన్‌ సంగీత దర్శకత్వం నిర్వహించారు. జయభాదురి సంజీవ్‌ కుమార్‌ సరసన హీరోయిన్‌గా నటించింది. ఇందులో హీరో, హీరోయిన్లు ఇద్దరూ మూగ, చెముడు వున్న బధిరులు. ఆత్మవిశ్వాసంతో వారిద్దరూ జీవితాన్ని చాలెంజ్‌గా తీసుకొని విజయం సాధించడం ఈ చిత్ర నేపథ్యం. సంజీవ్‌ కుమార్‌తోబాటు గుల్జార్‌కు ఉత్తమ స్కీన్ర్‌ ప్లే రైటర్‌గా జాతీయ బహుమతి లభించింది. ఫిలింఫేర్‌ బహుమతికి సంజీవ్‌ కుమార్‌ పేరు నామినేట్‌ అయినా అ బహుమతి దక్కలేదు. ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి. ఉత్తమ నటుడి బహుమతికి అమితాబ్‌ బచ్చన్‌ (జంజీర్‌), ధర్మేంద్ర (యాదోం కి బారాత్‌), రాజేష్‌ ఖన్నా (దాగ్‌), సంజీవ్‌ కుమార్‌ (కోషిష్‌), రిషి కపూర్‌ (బాబి)ల పేర్లు నామినేట్‌ కాగా, రిషి కపూర్‌కు ఆ బహుమతి దక్కింది. తన ఆత్మకథలో రిషికపూర్‌ ఈ బహుమతిని ముప్పై వేల రూపాయలు వెచ్చించి కొనుక్కున్నానని తెలపడం సంచలనం సృష్టించింది. ఇది ఫిలింఫేర్‌ బహుమతుల వ్యవస్థకే ఒక మాయని మచ్చగా మిగిలింది. 1973లో రాజా నవాతే నిర్మించిన ‘మన్‌ చలి’ సినిమాలో సంజీవ్‌ కుమార్‌ అద్భుతమైన కామెడీ పంచారు. ఇదే సినిమాను తెలుగులో ‘మొగుడు కావాలి’గా తీశారు. అదే సంవత్సరం సంజీవ్‌ కుమార్, జయబాధురి జంటగా ‘అనామిక’ అనే సస్పెన్స్‌ సినిమా విడుదలైంది. కమర్షియల్‌గా విజయవంతమైన ఈ సినిమాను తెలుగులో ‘కల్పన’ పేరుతో పునర్నిర్మించారు. రాహుల్‌ దేవ్‌ బర్మన్‌ సంగీతం ఈ చిత్రానికి పెద్ద అసెట్‌గా నిలిచింది. ‘మేరి భీగీ భీగీ సి’ (కిషోర్‌ కుమార్‌), ‘బహారోం మే చలే ఆవో’ (లతాజీ) పాటలు బినాకా వార్షిక రేటింగులో స్థానం సంపాదించాయి. 1974లో ఎ.భీమ్‌ సింగ్‌ దర్శకత్వంలో తెలుగు ‘నవరాత్రి’ (1964) సినిమాను హిందీలో ‘నయా దిన్‌ నయీ రాత్‌’ పేరుతో పునర్నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావులాగే సంజీవ్‌ కుమార్‌ ఇందులో తొమ్మిది పాత్రలను పోషించారు. ఈ చిత్రంతో సంజీవ్‌ కుమార్‌కు నటుడిగా హోదా పెరిగింది. 1975లో గుల్జార్‌ దర్శకత్వంలో ‘ఆంధి’ పేరుతో ఒక రాజకీయ నేపథ్యంతో వున్న సినిమా నిర్మితమైంది. ఇందులో సంజీవ్‌ కుమార్‌ సరసన హీరోయిన్‌గా బెంగాలి నటి సుచిత్రాసేన్‌ నటించింది. ఈ సినిమాలో హీరోయిన్‌ ఆహార్యం నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధిని పోలి ఉండడంతో సినిమా విడుదలమీద నిషేధం విధించింది నాటి ప్రభుత్వం. ఫైగా అవి దేశంలో ఎమర్జెన్సీ విధించిన రోజులో కావడంతో సినిమా విడుదల చేయడం కుదరలేదు. 1977లో ఇందిరాగాంధీ ఎన్నికల్లో పరాజయం పాలై జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ సినిమా విడుదలై డంకా బజాయించింది. ఆర్‌.డి.బర్మన్‌ సంగీతం సినిమాకు బాగా సహకరించింది. సంజీవ్‌ కుమార్‌కు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ బహుమతి, గుల్జార్‌కు ఉత్తమ చిత్ర దర్శకుడిగా బహుమతి లభించాయి.

Sanjeev-Kumar

‘షోలే’లో ఠాకూర్‌గా…
రమేష్‌ సిప్పీ దర్శకత్వంలో జి.పి. సిప్పీ నిర్మించిన సంచలన చిత్రం ‘షోలే’ (1975)లో సంజీవ్‌ కుమార్‌ రిటైర్డ్‌ పోలీసు అధికారి ఠాకూర్‌ బలదేవ్‌ సింగ్‌ పాత్రను పోషించారు. ఈ సినిమా మొత్తం సంజీవ్‌ కుమార్‌ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అమితాబ్‌ బచ్చన్, ధర్మేంద్రలు కూడా ఇందులో నటించినా సంజీవ్‌ కుమార్‌నే హీరో అని చెప్పుకోవాలి. ఠాకూర్‌ పాత్రకు ముందు ప్రాణ్‌ పేరు పరిశీలనకు వచ్చింది. కానీ అది సంజీవ్‌ కుమార్‌నే వరించింది. సంజీవ్‌ కుమార్‌కు గబ్బర్‌ సింగ్‌ పాత్ర పోషించాలని వున్నా రచయితలు సలీం-జావేద్‌ వారించారు.

ఠాకూర్‌ పాత్ర ప్రేక్షకుల నుంచి జాలి పడే పాత్ర అని, గబ్బర్‌ సింగ్‌ని ద్వేషిస్తారని నచ్చజెప్పారు. ఈ చిత్రం కూడా ఎమర్జెన్సీ కాలంలో నిర్మితమవడంతో, విడుదల మీద నిర్మాతలకు చాలా అనుమానాలుండేవి. అదృష్టవశాత్తు అవేమీ ఆటంకపరచలేదు. షర్మీలా టాగూర్, సంజీవ్‌ కుమార్‌ నటించిన మరొక గుల్జార్‌ సినిమా ‘మౌసమ్‌’ ఏకంగా ఎనిమిది ఫిలింఫేర్‌ నామినేషన్లు అందుకుంది. అందులో సంజీవ్‌ కుమార్‌ పేరుకూడా వుంది. అయితే ‘ఆంధీ’ సినిమాలో నటనకు సంజీవ్‌ కుమార్‌ అవార్డు దక్కింది. ఈ సినిమాకు రెండు జాతీయ బహుమతులు, రెండు ఫిలింఫేర్‌ బహుమతులు దక్కాయి. 1976లో వచ్చిన ‘అర్జున్‌ పండిట్‌’, ‘జిందగి’ సినిమాలలో నటనకు సంజీవ్‌ కుమార్‌ పేరు ఉత్తమ నటుడి బహుమతి కోసం నామినేట్‌ కాగా, ఆ బహుమతి ‘అర్జున్‌ పండిట్‌’కు దక్కింది. 1977 లో సంజీవ్‌ కుమార్‌ నటించిన ‘ఏ హై జిందగీ’ సినిమాలో నటనకు కూడా ఫిలింఫేర్‌ బహుమతికి పేరు ప్రతిపాదించారు. సత్యజిత్‌ రాయ్‌ దర్శకత్వం వహించిన ‘షత్రంజ్‌ కే ఖిలాడి’ క్లాసిక్‌ సినిమాలో హీరోగా నటించడం సంజీవ్‌ కుమార్‌ చేసుకున్న పుణ్యమని సినీ పండితులు చెబుతుంటారు. ఈ చిత్రాన్ని 51వ ఆస్కార్‌ బహుమతి పోటీకి భారత దేశపు అఫిషియల్‌ ఎంట్రీగా పంపారు. ‘త్రిశూల్‌’, ‘విధాత’ చిత్రాలలో నటనకు సంజీవ్‌ కుమార్‌ పేరును ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్‌ బహుమతికోసం ప్రతిపాదించారు. అలాగే ’పతి పత్ని అవుర్‌ వో’, ‘దేవత’ (1978), ‘అంగూర్‌’ (1982) సినిమాలలో ఉత్తమ నటనకు సంజీవ్‌ కుమార్‌ పేరు ఫిలింఫేర్‌ బహుమతికి ప్రతిపాదించారు. ‘లవ్‌ అండ్‌ గాడ్‌’, ‘ప్రొఫెసర్‌ పడోసన్‌’ సినిమాలతోబాటు మరో ఎనిమిది సినిమాలు సంజీవ్‌ కుమార్‌ మరణించిన తరువాత విడుదల అయ్యాయి. సంజీవ్‌ కుమార్‌ తెలుగు నటి ఎల్‌.విజయలక్ష్మి సరసన మూడు సినిమాలలో నటించారు. వాటిలో ‘హుస్న్‌ అవుర్‌ ఇష్ఖ్‌’, ‘బాదల్‌’ సినిమాలు హిట్టయ్యాయి. ఆరు సినిమాలు మాలాసిన్హా సరసన, ఐదు సినిమాలు తనూజ సరసన సంజీవ్‌ కుమార్‌ నటించారు. ముఖ్యంగా దక్షినాది సినీ నిర్మాతలు సంజీవ్‌ కుమార్‌తో సినిమాలు తీయాలని అభిలషించేవారు. ‘రాజా అవుర్‌ రంక్‌’, ‘నయా దిన్‌ నయీ రాత్‌’, ‘ఏ హై జిందగీ’, ‘చందా అవుర్‌ బిజిలి’, ‘స్వర్గ్‌ నరక్‌’, ‘టక్కర్‌’, ‘శ్రీమాన్‌ శ్రీమతి’, ‘ఇత్నీ సి బాత్‌’, ‘గౌరీ’ సినిమాలు వాటిలో కొన్ని మాత్రమే. సంజీవ్‌ కుమార్‌ హిందీలోనే కాకుండా తెలుగు, మరాఠి, పంజాబీ, సింధి, గుజరాతి భాషా చిత్రాల్లో కూడా నటించారు.

Sanjeev-Kumar

ఒంటరి జీవితం…
సంజీవ్‌ కుమార్‌ భగ్నప్రేమికుడు. జీవితమంతా బ్రహ్మచారిగానే గడిపారు. 1973లో సంజీవ్‌ కుమార్‌ హేమామాలినిని వివాహమాడే ప్రయత్నం జరిగింది. 1976లో అతనికి తొలిసారి గుండెపోటు వచ్చింది. అప్పటివరకూ హేమామాలినితో వివాహం జరిగే అవకాశాలు సన్నగిల్లలేదు. తరువాత ఆమెకు ధర్మేంద్రతో వివాహం జరగడం సంజీవ్‌ కుమార్‌ను వ్యాకులతకు గురిచేసింది. కొంతకాలం ఆగాక అతడు సులక్షణా పండిట్‌కు దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకోలేదు కానీ ఇద్దరూ కలిసే వున్నారు. ఎందుకో సంజీవ్‌ కుమార్‌ ఆమెను పెళ్లి చేసుకునేందుకు మాత్రం సుముఖత చూపలేదు. దాంతో సులక్షణ కూడా అవివాహితగానే ఉండి పోయింది. రాజేష్‌ ఖన్నాతో సంజీవ్‌ కుమార్‌ చాలా స్నేహంగా వుండే వారు. ఆయనకు పుట్టుకతోనే గుండెలో లోపం వుండేది. అది జన్యుపరంగా సంక్రమించినదే! 1976లో తొలిసారి గుండెపోటు వచ్చినప్పుడు అమెరికాలో బైపాస్‌ చికిత్స చేయించుకున్నారు. అయితే 1985 నవంబరు 6న సంజీవ్‌ కుమార్‌కు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దాంతో బ్రతికే అవకాశం లేకుండా పోయింది. సంజీవ్‌ కుమార్‌ మరణానికి ముందే అతని తమ్ముడు కుల్‌ చనిపోయాడు. సంజీవ్‌ కుమార్‌ చనిపోయిన ఆరు నెలలకు సంజీవ్‌ కుమార్‌ మరొక తమ్ముడు కిషోర్‌ కూడా చనిపోయాడు. సంజీవ్‌ కుమార్‌ చనిపోయాక ఆయన నటించిన పది సినిమాలు విడుదలయ్యాయి.

Sanjeev-Kumar

అవార్డుల దొంతరలు…
సంజీవ్‌ కుమార్‌ రెండుసార్లు ‘దస్తక్‌’, ‘కోషిష్‌’ సినిమాలలో నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ స్థాయిలో ‘భరత్‌’ అవార్డు అందుకున్నారు. మూడు సార్లు ఫిలింఫేర్‌ సంస్థ నుంచి ఉత్తమ నటుడి బహుమతులు అందుకున్నారు. తొమ్మిదిసార్లు సంజీవ్‌ కుమార్‌ పేరును ఉత్తమ నటుడి బహుమతి కోసం ప్రతిపాదించారు. వరుసగా ఖిలోనా, కోషిష్, షోలే, మౌసమ్, ఏ హై జిందగీ, జిందగి, దేవత, పతి పత్ని అవుర్‌ వో, అంగూర్‌. త్రిశూల్, విధాత చిత్రాలలో నటనకు ఉత్తమ సహాయ నటుడి గా సంజీవ్‌ కుమార్‌ పేరు ఫిలింఫేర్‌ బహుమతికోసం నామినేట్‌ అయ్యాయి. సంజీవ్‌ కుమార్‌ను వరించిన ఇతర సంస్థల అవార్డులు పన్నెండు దాకా వున్నాయి. గుజరాత్‌ ప్రభుత్వం సూరత్‌ పట్టణంలో ఒక వీధికి ‘సంజీవ్‌ కుమార్‌ మార్గ్‌’ అనే పేరు పెట్టింది. సూరత్‌ లోని ఒక పాఠశాలకు సంజీవ్‌ కుమార్‌ పేరు పెట్టారు. 3 మే, 2013న సంజీవ్‌ కుమార్‌ చిత్తరువుతో తపాలా శాఖ స్మారక స్టాంపును విడుదల చేసింది. సూరత్‌ పట్టణంలోనే సంజీవ్‌ కుమార్‌ పేరుతో ఒక పెద్ద ఆడిటోరియం నిర్మించారు. జాతీయ స్థాయిలో చిన్నారుల చదువు కోసం సహాయపడేందుకు సంజీవ్‌ కుమార్‌ ఫౌండేషన్‌ నెలకొల్పారు. సూరత్‌ లో సంజీవ్‌ కుమార్‌ స్మారక నాటక పోటీలను స్థానిక మునిసిపల్‌ కార్పోరేషన్‌ ప్రతి ఏటా నిర్వహిస్తోంది. కళలు, నాటక అభివృద్ధి కోసం సంజీవ్‌ కుమార్‌ పేరుతో సూరత్‌ లో ఒక పెద్ద అకాడమీ ని స్థాపించారు.

-ఆచారం షణ్ముఖాచారి

Related posts