telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మీ వంట గ్యాస్ సిలిండర్ కు .. భీమా.. ప్రమాదం జరిగితే.. నష్టపరిహారం..

cylinder blast in Filmnagar hyderabad

నేడు ఏ చిన్నదానికైనా భీమా అంటూ పరిగెడుతున్నారు.. అదే ప్రమాదం అని తెలిసి ఇంటిలో వాడే వంట గ్యాస్ కు అది ఉందా లేదా అనేది గమనించడంలేదు. అయితే, రాష్ట్రంలో తరచూ గ్యాసు ప్రమాదాలు జరుగుతున్నా బాధితులు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అర్థిస్తున్నారే తప్ప హక్కుల గురించి తెలుసుకోవడం లేదు. వంట చేసుకోవడానికి ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్‌కూ బీమా ఉంటుంది. సిలిండర్‌లో ఏదైనా లోపం వల్ల ప్రమాదం జరిగితే వినియోగదారులు నష్ట పరిహారం పొందవచ్చు. ఈ విషయం తెలియక చాలామంది ప్రమాదాలు జరిగినప్పుడు సద్వినియోగం చేసుకోవడం లేదు.

చమురు పరిశ్రమలు, గ్యాస్‌ సిలిండర్ల వల్ల అగ్ని ప్రమాదాలకు ఎక్కువ ఆస్కారముంటుంది. అందుకే ముందస్తుగా ప్రభుత్వరంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలైన ఇండియన్‌ ఆయిల్‌ (ఐఓసీఎల్‌), హిందూస్థాన్‌ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్‌), భారత్‌ పెట్రోలియం (బీపీసీఎల్‌), చమురు పరిశ్రమలకు ‘పబ్లిక్‌ లయబిలిటీ పాలసీ ఫర్‌ ఆయిల్‌ ఇండస్ట్రీస్‌’ కింద వినియోగదారులు, వారి ఆస్తులకు ‘థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌’ చేయిస్తాయి. ఇందుకోసం వినియోగదారుల వద్ద ఎలాంటి ప్రీమియమూ వసూలు చేయరు.

గ్యాసు ప్రమాదం జరిగినప్పుడు వినియోగదారులు నేరుగా బీమా కంపెనీకి తెలపాల్సిన అవసరం లేదు. సంబంధిత పంపిణీదారుకు సమాచారమందిస్తే సరిపోతుంది. వారు ప్రమాదానికి గల కారణాలను ఆరాతీసి బీమా తీసుకున్న సదరు కంపెనీ ప్రతినిధులకు తెలియజేస్తారు. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే మరణ ధ్రువీకరణ పత్రం, శవపరీక్ష నివేదిక, ప్రాథమిక విచారణ నివేదిక, గాయపడితే వైద్యచికిత్స వివరాలు, వైద్యులిచ్చిన ప్రిస్కిప్షన్‌, మందులు, ఆసుపత్రి ఖర్చులకు సంబంధించిన బిల్లులను ఆయిల్‌ కంపెనీకి సమర్పించాలి. బీమా కంపెనీ పూర్తిస్థాయిలో విచారణ జరిపి పరిహారాన్ని సంబంధిత ఆయిల్‌ కంపెనీకి చెల్లిస్తుంది. ఆ కంపెనీ ప్రతినిధులు నష్టపోయిన వినియోగదారులకు ఆ మొత్తాన్ని అందజేస్తారు.

ఎల్పీజీ సిలిండర్‌ ప్రమాదంలో ఎవరైనా చనిపోతే రూ.5లక్షలు పరిహారంగా చెల్లిస్తారు. గాయపడితే వైద్యచికిత్స కోసం గరిష్ఠంగా రూ.లక్ష అందిస్తారు. ఇందులో తక్షణసాయం కింద ఒక్కో క్షతగాత్రునికి రూ.25వేలు ఇస్తారు. ఆస్తులకు నష్టం వాటిల్లితే గరిష్ఠంగా రూ.లక్ష వరకు పరిహారం పొందవచ్చు. చమురు పరిశ్రమల్లో ఒక్కో ప్రమాదానికి గరిష్ఠంగా రూ.50లక్షలు, ప్రాణనష్టం జరిగితే రూ.10లక్షల చొప్పున పరిహారాన్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది.

ప్రమాదం జరగ్గానే బీమా కంపెనీలు అంత తేలిగ్గా నష్టపరిహారం చెల్లించవు. దీనికి బోలెడు నిబంధనలుంటాయి. బీమా ఒప్పందంలో పొందుపర్చిన నియమాల మేరకే పరిహారం చెల్లిస్తాయి. గ్యాసు కనెక్షన్‌ తీసుకున్నప్పుడు ఇచ్చిన చిరునామాలో ఉన్న ఆస్తులకు మాత్రమే పరిహారం వర్తిస్తుంది. ఒకవేళ వేరే ఇంటికి మారినప్పుడు తప్పనిసరిగా కొత్త చిరునామాను నమోదు చేయించుకోవాలి. సిలిండర్‌లో లోపం వల్ల ప్రమాదం వాటిల్లితేనే పరిహారం ఇస్తారు. ఆత్మహత్యాయత్నం, బలవన్మరణం, మద్యం, డ్రగ్స్‌ ప్రభావం వల్ల సంభవించిన ప్రమాదాలకు బీమా కంపెనీ బాధ్యత వహించదు. భూకంపాలు, వరదలు, తుపానులు, ఇతర ప్రకృతి విపత్తుల వల్ల గ్యాసు ప్రమాదం జరిగినా నష్టపరిహారం ఇవ్వరు.

Related posts