telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

వడ్డీ రేట్లు తగ్గించిన .. ఆర్బీఐ ..

RBI

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటు తగ్గిస్తూ శుభవార్త చెప్పింది. 2019-20 ఆర్థిక సంవత్సర ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షను పూర్తి చేసిన ఆర్బీఐ, రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీనితో ప్రస్తుతం ఉన్న 6.25 శాతం రెపో రేటు 6 శాతానికి తగ్గనుండగా, గృహ, వాహన, వ్యక్తిగత రుణ గ్రహీతలు లబ్దిని పొందనున్నారు. రెపో రేటు మినహా మిగిలిన రేట్లలో మార్పుండబోదని ఈ సందర్భంగా ఆర్బీఐ ప్రకటించింది.

రివర్స్‌ రెపో రేటు 5.75 శాతంగా ఉంటుందని, ఎంఎస్‌ఎఫ్‌ రేటు, బ్యాంక్‌ రేటు 6.25 శాతం వద్ద కొనసాగుతుందని స్పష్టం చేసింది. చిల్లర ధరల ద్రవ్యోల్బణాన్ని 4 శాతం (2 శాతం అటూ ఇటూ) వద్ద కట్టడి చేయాలని నిర్ణయించామని పరపతి సమీక్ష నిర్ణయాలు వెలువరించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఫిబ్రవరిలో జరిగిన ఎంపీసీ సమావేశం సమయానికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించిందని గుర్తించినట్టు వెల్లడించిన ఆయన, అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా తొలి త్రైమాసికంలో ఆశించిన స్థాయిలో వృద్ధిరేటు నమోదు కాలేదని అన్నారు. యూరప్ లో కూడా అదే పరిస్థితి నెలకొందని, బ్రెగ్జిట్‌ తో యూకే వృద్ధిరేటు దిగజారిందని అభిప్రాయపడ్డారు.

Related posts