telugu navyamedia
వ్యాపార వార్తలు

ఆన్‌లైన్ చెల్లింపులు చేసే వారికి ఆర్‌బీఐ శుభవార్త

ఆన్‌లైన్‌ ద్వారా కార్డు చెల్లింపుల్లో అవకతవకలు, మోసాలను అరికట్టేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ కొత్త నిబంధనలను ప్రవేశ పెడుతోంది. ఈ కొత్త నిబంధనలు వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. ఇకపై ఆన్‌లైన్ చెల్లింపుల కోసం టోకెన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నది. కార్డు ద్వారా జరిపే లావాదేవీలలో కార్డు జారీ చేసిన బ్యాంక్ లేదా కార్డ్ నెట్‌వర్క్ సంస్థలు మాత్రమే డేటాను నిల్వచేసుకునే అధికారం కలిగి ఉంటాయి.

ఏదైనా ఆహారంగానీ, క్యాబ్‌ గానీ బుక్‌ చేసే సమయంలో మనం మన కార్డు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరాలు ఆయా సంస్థల వద్ద డేటాగా భద్రపరుస్తారు. ఈ డేటాతో మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మోసాలను నివారించేందుకు ఆర్బీఐ ఈ టోకెన్‌ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నది. ఈ కొత్త విధానంలో కార్డు వివరాలు చెప్పాల్సిన అవసరం లేకుండా సింపుల్‌గా ప్రత్యేక ప్రత్యామ్నాయ సంఖ్యను ‘టోకెన్‌’గా ఇవ్వనున్నారు. ఈ టోకెన్‌ మన కార్డ్‌తో లింక్‌ అయి ఉంటుంది. ఈ విధానంలో మన కార్డ్‌ను దుర్వినియోగపరిచి మోసం చేయడానికి అవకాశాలు ఉండవని ఆర్బీఐ పేర్కొంది.

ఈ టోకెన్‌ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో కార్డుపై ఉండే 16 అంకెల సంఖ్యను
నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ 16 అంకెల సంఖ్యకు బదులుగా టోకెన్‌ను నమోదు చేస్తే సరిపోతుంది. కంపెనీలు ఒకవేళ ఇప్పటికే మీ కార్డు వివరాలను స్టో్ర్ చేసుకొని ఉంటే ఆ డేటాను తొలగించాల్సి ఉంటుంది. ట్రాన్సాక్షన్ ట్రాకింగ్ వంటి వాటి కోసం కంపెనీలు కేవలం కార్డు చివరి నాలుగు అంకెలు, పేరు వంటి వాటిని మాత్రమే స్టోర్ చేసుకునే వెసులుబాటు ఆర్‌బీఐ కల్పించింది.

 

Related posts