telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

రాయపాటి స్థానంలో .. లగడపాటి.. ఎవరికి ఎక్కడ.. ?

rayapati and lagadapati from tdp at

తెలుగుదేశం పార్టీ లోక్ సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావు రాష్ట్ర రాజకీయాల్లో బిగ్ షాట్ గా గుర్తింపు ఉన్నా సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆయనకు టికెట్ కేటాయించడంపై తెలుగుదేశం పార్టీ ఊగిసలాడుతోంది. రాయపాటికి టికెట్ ఇవ్వాలా? వద్దా? అనే విషయంపై నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తోంది. రాయపాటికి బదులుగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ లోక్ సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కు టికెట్ ఇవ్వాలని తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తనకు నరసరావు పేట టికెట్ ఖాయమంటూ రాయపాటి పదేపదే చెప్పుకోవడానికి కారణం ఇదేననే అభిప్రాయం వినిపిస్తోంది.

గుంటూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి నాలుగుదఫాలు ఆయన విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ లో కొనసాగలేని పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోని నరసరావు పేట్ లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి, వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి అయోధ్యా రామిరెడ్డిపై విజయం సాధించారు. తన కుమారుడికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ సంస్థకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టు పనులను దక్కించుకోవడానికే రాయపాటి టీడీపీలో చేరారనే విమర్శలు అప్పట్లో చెలరేగాయి.

నరసరావు పేట స్థానం వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూడా తనకే దక్కుతుందని రాయపాటి భావిస్తూ వచ్చారు. చివరి నిమిషంలో ఆయన ఆత్మ రక్షణలో పడ్డారు. దీనికి కారణం తనకు బదులుగా లగడపాటి రాజగోపాల్ పేరును టీడీపీ అధిష్ఠానం పరిశీలిస్తుండటమే. పొరుగునే ఉన్న విజయవాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లగడపాటి.. వరుసగా రెండుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. సర్వేలను నిర్వహించడంలో దిట్టగా పేరుపొందారు. దీనితో కమ్మ సామాజిక వర్గానికి చెందిన లగడపాటిని బరిలో దింపడం సులభమేనని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాయపాటిపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందంటూ ఇదివరకే పార్టీ నాయకుల నుంచి అందిన నివేదికలను ఆధారంగా చేసుకుని, ఆయనను తప్పించి లగడపాటికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Related posts