telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సమగ్ర అభివృద్ధికి.. జగన్ నిర్ణయాన్ని స్వాగతించాలి.. : రాపాక

rigging case on rapaka varaprasad

జనసేన శాసన సభ్యుడు రాపాక వరప్రసాద్ మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని సమర్థించారు. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలంటూ వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని, దాన్ని తాను స్వాగతిస్తున్నానని రాపాక వరప్రసాద్ అన్నారు. గురువారం ఆయన జిల్లాలోని మలికిపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రికి ఉందని, అందులో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకుని ఉంటారని అన్నారు. ఎవ్వరికీ నష్టం జరక్కుండా, ఏ ప్రాంతానికీ నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని, అలా చూస్తారని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే నిర్ణయం వల్ల ఏ ప్రాంత రైతు కూడా, ప్రత్యేకించి- రాజధాని అమరావతి ప్రాంత రైతులు కంటతడి పెట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని రాపాక సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా నడుచుకుంటుందని భావిస్తున్నానని అన్నారు.

మూడు రాజధానులను ఏర్పాటు చేయడం వల్ల మూడు ప్రాంతాలు కూడా సమంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి మొత్తాన్నీ హైదరాబాద్ కే పరిమితం చేశారని, ఫలితంగా విభజన తరువాత 13 జిల్లాలలో ఏర్పాటైన ఏపీ నష్టపోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో అభివృద్ధిని గానీ, అధికారాన్ని గానీ, పరిపాలనను గానీ వికేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ విషయంలో రవాణా పరమైన ఇబ్బందులు ప్రజలకు ఎదురవుతాయని, జరిగే మంచిని గుర్తించాలని సూచించారు. వైఎస్ జగన్ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల ప్రాంతీయ అసమానతలు ఎట్టి పరిస్థితుల్లోనూ తలెత్తడానికి అవకాశమే లేదని రాపాక వరప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతీయ అసమానతల వల్లే తెలంగాణ ఉద్యమం ఏర్పడిందనే విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటి పరిస్థితులు రానివ్వకుండా వైఎస్ జగన్ ముందు చూపుతో వ్యవహరించారని అన్నారు. కొద్దిరోజులగా తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వీటిని ఎవ్వరూ నమ్మవద్దని ఆయన కోరారు. పార్టీ మారే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.

Related posts