telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రకాశం జిల్లా ప్రజల దశాబ్దాల కల.. రామాయపట్నం పోర్టు!

ప్రకాశం జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేర్చే దిశగా ఏపీ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  మంగళవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి, రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయాలంటూ కోరారు. జగన్‌ నిర్ణయం పట్ల జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతుంది.

అనుకున్న ప్రకారం రామాయపట్నం పోర్టు నిర్మాణం జరిగితే జిల్లా రూపురేఖలే మారనున్నాయి. జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు మరింత మెరుగవుతాయి. వెనుకబడిన జిల్లాగా ఉన్న ప్రకాశం జిల్లాలో పోర్టు నిర్మాణం చేపట్టాలనే నిర్ణయం వల్ల జిల్లా అభివృద్ధికి రెడ్‌ కార్పెట్‌ పరిచినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఎదురుచూస్తున్న జిల్లా ప్రజానీకానికి సీఎం జగన్ నిర్ణయం వరంగా మారనుంది.

పోర్టు నిర్మాణానికి రామాయపట్నం అనుకూలంగా ఉంటుందని 2012 ఆగస్టు 22వ తేదీన కేంద్ర నౌకాయాన మంత్రిత్వశాఖ స్టేక్‌హోల్డర్స్‌తో సమావేశం నిర్వహించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ తరువాత 2012 సెప్టెంబర్‌ 2న అప్పటి ప్రభుత్వం రామాయపట్నం ప్రాంతం ఓడరేవు, నౌకా నిర్మాణ కేంద్రానికి అణువైనదని పేర్కొంటూ కేంద్రానికి లేఖ రాసింది. ఆన్ని విషయాలను అధ్యనయం చేసి పోర్టు ఏర్పాటు అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వద్ద  సీఎం జగన్  ప్రస్తావించారు. 

Related posts