telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

మళ్లీ శ్రీవారి సేవలో .. రమణదీక్షితులు..

ramana dikshitulu on jagan victory

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా తిరుమల పూర్వ ప్రధానార్చకులు రమణదీక్షితులు త్వరలో ఆలయం ప్రవేశం చేసేందుకు లైన్‌ క్లియర్‌ అయింది. ఈ మేరకు సీఎం ఆదేశాలు జారీ చేయడంతో రమణ దీక్షితులుకు ఆలయ ప్రవేశం కల్పించేందుకు టీటీడీ సిద్దమవుతోంది. దీంతో శ్రీవారి సేవలో పాల్గొనేందుకు ఆయనకు మార్గం సుగమమైంది. ఆగమసలహాదారుడిగా నియమించడంతో పాటు నూతన అర్చకులకు మార్గదర్శకుడిగా ఆయన సేవలు వినియోగించుకోవాలని టీటీడీ భావిస్తోంది. అదేవిధంగా కోర్టు కేసుల పరిష్కారం తర్వాత అర్చకత్వ బాధ్యతలు కూడా అప్పగించాలని యోచిస్తోంది. దీనిలో భాగంగా రమణ దీక్షితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది.

రమణదీక్షితులు ఇద్దరు కుమారులను గోవిందరాజస్వామి ఆలయం నుంచి తిరిగి తిరుమల ఆలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం హయాంలో టీటీడీలో జరిగిన ఆరాచకాలు, అవినీతిపై రమణదీక్షితులు బహిరంగ ఆరోపణలు చేయడంతో ఆయనను ప్రధాన అర్చకుడి పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా స్వామి వారి అతి పురాతనమైన ఆభరణాలు విదేశాలకు తరలి వెళ్తున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేయడంతో పాటు ఆగమశాస్త్రానికి విరుద్ధంగా శ్రీవారి పోటును మూసివేసి, తవ్వకాలు జరిపారని విమర్శించిన విషయం తెలిసిందే.

Related posts