telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాళ్ళపల్లి .. ఓ అరుదైన కళాకారుడు ..

rallapalli memories

అది 1966 వ సంవత్సరం. న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్. ఒక తెలుగు నాటకం చూడటానికి రాజధానిలోని ప్రముఖులు హాజరయ్యారు. వారిని అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఆహ్వానించారు. అనుకున్న సమయానికి రాధాకృష్ణగారు వచ్చారు. అందరు ఆయన హాలులోకి రాగానే గౌరవంగా లేచి నుంచొని అభివాదం చేశారు. అప్పుడు నాటకం మొదలు పెట్టారు. ఆ నాటకం పేరు “మృచ్ఛకటికం “.

ఆ నాటకాన్ని అందరు సంబ్రమాశ్చర్యాలతో చూశారు. నాటక అనంతరం రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు నటీనటులను పేరు పేరున అభినందించారు. ఒక తెలుగు వాడుగా ఒక తెలుగు నాటకాన్ని రాష్ట్రపతి భవన్ లో ప్రదర్శించడం అరుదైన, అపూర్వమైన విషయం. ఆరోజు ఆ నాటకంలో 21 సంవత్సరాల యువకుడు కూడా వున్నాడు. అతని సంతోషం వర్ణనాతీతం. ఎందుకంటే అతనికి నాటకం అంటే ప్రాణం..చిన్నప్పటి నుంచి నాటకం తోనే పెరిగాడు. నాటకమే శ్వాసగా మార్చుకున్నాడు. అతని పేరు రాళ్ళపల్లి వెంకట నరసింహారావు.

శుక్రవారం రోజు హైద్రాబాద్ లో తన 73వ ఏట మరణించాడు. రాళ్ళపల్లి గా నాటక, సినిమా రంగాల్లో ప్రసిద్ధి చెందిన రాళ్ళపల్లి వెంకట నరసింహారావు జీవితం చాలా సాదా సీదాగా మొదలైంది. చదువుతో పాటు నాటకాల్లో నటిస్తూ ఉండేవాడు. ఆంధ్ర దేశంలో ఎక్కడ నాటం ప్రదర్శిస్తున్న అక్కడికి వెళ్ళేవాడు. అలా నాటకాలు వేస్తున్న రాళ్ళపల్లి జీవితం 1976లో అనుకోని మలుపు తిరిగింది. రచయిత సి ఎస్ రావు రాసిన “ఊరుమ్మడి బతుకులు ” అన్న కథ దర్శకుడు బి ఎస్.నారాయణకు బాగా నచ్చింది. దీనిని సినిమాగా నిర్మిద్దామని అనుకున్నారు . అందుకు మిత్రులు ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు.

అది గ్రామీణ జీవితంలో కష్ట నష్టాలను, కన్నీళ్లను తెలిపే యదార్ధ జీవన చిత్రం. ఇందులో ఒక ముఖ్య పాత్రకు రాళ్లపల్లిని ఎంపిక చేసుకున్నారు. ఇది చిత్రంలో ఓ ప్రధాన భూమిక. ఈ చిత్రం షూటింగ్ మొత్తం హైదరాబాద్ లోనే జరిగింది. ఇందులో సత్యేన్ద్ర కుమార్, మాధవి మిగతా పాత్రల్లో రంగస్థల నటి నటులను తీసుకున్నారు. తెలుగు సినిమా రంగంలో అదొక సంచలనం. ఈ సినిమాకు ఆ సంవత్సరం జాతీయ సినిమా అవార్డు వచ్చింది. అప్పుడు రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఈ అవార్డును బహుకరించినప్పుడు రాళ్ళపల్లిలో ఆనందం అంబరమైంది.

rallapalli memoriesరాళ్ళపల్లి ఎంత మంచి నటుడో అంత దయార్ద్ర హృదయుడు. సహా నటులకు ఆర్ధికంగా సహాయం చేయడంతో పాటు, నిరాశ్రయులైన వారికి తన ఇంట్లో ఆశ్రయం కలిపించిన మానవతావాది. గత 12 సంవత్సరాలుగా రంగస్థలంలో నటించి, ఇప్పుడు ఆర్ధికంగా చితికిపోయిన వారికి తమ పుట్టిన రోజు ఆగష్టు 15న ఆర్ధిక సహాయం అందిస్తున్నాడు. ఇప్పటికీ నాటకాలు ఆడటం అన్నా, చూడటం అన్నా రాళ్లపల్లికి ఎంతో ఇష్టం. మూడువేల నాటకాల్లోనూ, 650 చిత్రాల్లోనూ రాళ్ళపల్లి నటించాడు.

రాళ్ళపల్లి స్వయంగా “ముగింపులేని కథ”, “మారని సంసారం “, “జీవన్ మృతుడు ” నాటకాలు వ్రాశాడు. గత నాలుగు దశాబ్దాలుగా రాళ్ళపల్లి నాకు తెలుసు. అప్పుడు ఎంతో ఒదిగి వున్నాడో ఇప్పటికీ అలాగే వున్నాడు. అహం, ఆడంబరం, సినిమా గ్లామర్ తెలియని మామూలు మనిషి రాళ్ళపల్లి …

తనకోసం మాత్రమే కాకుండా ఇతరుల కోసం బ్రతికిన మానవతావాది రాళ్ళపల్లి. .

-భగీరథ

Related posts