telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“రాజుగారి గది-3” మా వ్యూ

RGG-3

బ్యానర్ : ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
న‌టీన‌టులు : అశ్విన్ బాబు, అవికాగోర్‌, అలీ, బ్ర‌హ్మాజీ, ప్ర‌భాస్ శ్రీను, ఊర్వ‌శి, హ‌రితేజ త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం : ఓంకార్‌
సంగీతం: ష‌బీర్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: క‌ల్యాణి చ‌క్ర‌వ‌ర్తి
సినిమాటోగ్ర‌ఫీ: ఛోటా కె.నాయుడు
ఎడిట‌ర్‌: గౌతంరాజు
డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా

బుల్లితెరపై హోస్ట్ గా ఓంకార్ మంచి గుర్తింపును దక్కించుకున్నారు. విశేష ప్రేక్షకాదరణ పొందిన ఓంకార్ ఆ తరువాత “రాజుగారి గది” చిత్రంతో దర్శకుడిగా మరి హిట్ అందుకున్నారు. బుల్లితెర‌పై పలు షోస్‌తో ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న ఓంకార్ తెర‌కెక్కించిన హార‌ర్ కామెడీ చిత్రం “రాజుగారి గ‌ది`. ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించింది. ఆ తరువాత ఈ సినిమాకు సీక్వెల్ గా “రాజుగారి గది-2” చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నాగార్జున, సమంత కీలకపాత్రల్లో నటించారు. అయితే “రాజుగారిగది” ఆకట్టుకున్నంతగా “రాజుగారి గది-2” ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ ఫ్రాంచైజీలో రూపొందిన మూడో భాగం “రాజుగారిగ‌ది 3”. అశ్విన్‌బాబు, అవికాగోర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన “రాజుగారి గది-3” ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ :
మాయ (అవికాగోర్) ఒక డాక్టర్. ఈ అందమైన అమ్మాయిని ఎవరన్నా ప్రేమిస్తున్నామంటూ “ఐ లవ్ యూ” చెబితే ఓ ఆత్మ వారిని చితకబాదుతుంది. దీంతో మాయ అంటే అందరూ భయపడుతుంటారు. మాయతో పాటు హాస్పిటల్ లో పని చేసే ఒక డాక్టర్ ఉండే కాలనీలోనే అనాథగా పెరిగిన అశ్విన్ కూడా నివాసం ఉంటాడు. అలీ, అశ్విన్ ఇద్దరూ రాత్రిళ్ళు తాగి గొడవ చేస్తూ చుట్టుపక్కల వాళ్ళకు చిరాకు తెప్పిస్తుంటారు. వీళ్ళ బాధ తట్టుకోలేక ఆ డాక్టర్ ఒక ప్లాన్ చేసిన విధంగా మాయ, అశ్విన్ ప్రేమలో పడతారు. అయితే ఎప్పటిలాగే మాయకు అశ్విన్ ఐ లవ్ యూ చెప్పగానే ఆత్మ అతన్ని చావగొడుతుంది. దీంతో అశ్విన్ అసలు విషయం ఏంటనేది తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతాడు. అందులో భాగంగా మాయ తండ్రిని కలుస్తాడు. కేర‌ళ‌లోని ప్ర‌ముఖ భూత మాంత్రికుడు గ‌రుడ‌ పిళ్లై (అజ‌య్ ఘోష్‌) తన కుమార్తె మాయ గురించి చెప్పిన షాకింగ్ నిజమేంటి ? ఆ ఆత్మ ఎవరు ? చివరకు మాయ, అశ్విన్ పెళ్ళి చేసుకుంటారా ? లేదా ? అనేది తెలియాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
అశ్విన్‌బాబు ఇంతకుముందు “రాజుగారి గది” చిత్రంలో నటించాడు. ఇప్పుడు దాని సీక్వెల్ “రాజుగారి గది-3″లో కూడా హీరోగా నటించాడు. ఇందులో అశ్విన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అశ్విన్ చుట్టూనే క‌థంతా మొత్తం తిరుగుతుంటుంది. త‌న పాత్ర‌కు తగ్గట్లుగా తన నటనతో మెప్పించాడు అశ్విన్. హీరోయిన్ గా నటించిన అవికా గోర్ ఈ సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో తన నటనతో ఫరవాలేదన్పించింది అవికా. ఇక ఈ సినిమాలో ఇతర పాత్రల్లో నటించిన అజ‌య్‌ఘోష్‌, ఐశ్వ‌ర్య, అలీ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు :
దర్శకుడు ఓంకార్ ఇంతకు ముందు తీసిన “రాజుగారి గది” రెండు చిత్రాల్లో కూడా హార్రర్, కామెడీతో పాటు మెసేజ్ ను కూడా మిళితం చేశాడు. కానీ ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ “రాజుగారి గది-3″లో కామెడీ, హారర్ పైనే పూర్తి దృష్టి సారించారు. ప్రీక్లైమాక్స్‌లో వ‌చ్చే 20 నిమిషాల‌ హార‌ర్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్ష‌కుల‌ను బాగా న‌వ్విస్తాయి. ప్రేక్షకులను కామెడీతో ఆకట్టుకోవడంలో దర్శకుడు ఓంకార్ విజయం సాధించారు. ఇక ష‌బీర్‌ సంగీతం ఓకే. హార‌ర్ పార్ట్స్‌కు నేప‌థ్య సంగీతం ప‌రావాలేదు. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తట్టుగా ఉన్నాయి.

రేటింగ్ : 2.5/5

Related posts