telugu navyamedia
రాజకీయ వార్తలు

ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారు.. చైనాకు రాజ్ నాథ్ వార్నింగ్

Rajnath singh Bjp

భార‌త్-చైనా స‌రిహ‌ద్దుల్లో చైనా దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌డాన్ని వ్యతిరేకిస్తున్నామని భార‌త ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. స‌రిహ‌ద్దుల్లో ఇరుదేశాల నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల‌పై చైనా రక్షణ మంత్రితో రష్యాలో స‌మావేశ‌మై చ‌ర్చ‌లు జ‌రిపిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చైనాకు చెప్పిన అంశాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

భారత సార్వభౌమత్వానికి భంగం కలిగితే అందుకు ప్ర‌తిగా ఎలాంటి చర్యకైనా వెనకడుగు వేసేది లేదని చైనాను రాజ్ నాథ్ హెచ్చరించారు. గల్వాన్‌ లోయతో పాటు వాస్తవాధీన రేఖ వెంట పలు ప్రాంతాల్లో ఇటీవల చైనా వ‌ల్ల చోటు చేసుకున్న‌ పరిణామాలపై రాజ్‌నాథ్‌ నిరసన వ్యక్తం చేశారని వివ‌రించింది.

స‌రిహ‌ద్దుల వ‌ద్ద‌ యథాతథ పరిస్థితిని కొనసాగించాలన్న ఒప్పందాలను డ్రాగ‌న్ దేశం ఉల్లంఘిస్తోంద‌ని ఆయ‌న చెప్పారని తెలిపింది. సరిహద్దు భద్రత విషయంలో భారత సైన్యం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని చైనాకు ఆయ‌న గుర్తు చేశారు. ఇరు దేశాధినేతల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాల్ని అమలు చేయాలని అన్నారు.

Related posts