telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

ఈవీఎం లపై వస్తున్న దుష్ప్రచారాలు నమ్మవద్దు : రజత్ కుమార్

Rajat Kumar Lok Sabha Elections

ఈవీఎంలపై సామాజిక మాధ్యమాలు వేదికగా వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్ కుమార్ సూచించారు. హైదరాబాద్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పరిశీలకులు, పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను సీల్ చేసి, స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరుస్తామని స్పష్టం చేశారు. ఈ విషయమై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరుగుతోందని, ఈ విషయాలను నమ్మొద్దని సూచించారు.

అవగాహన కల్పించే నిమిత్తం జగిత్యాలలో ఆటోలో రవాణా చేసిన ఈవీఎంలను వినియోగించినట్టు చెప్పారు. దుష్ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని రజత్ కుమార్ హెచ్చరించారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పార్టీల ప్రతినిధులు కూడా ఉండవచ్చని, కీసరలో ఈవీఎంలను సీల్ చేసేటప్పుడు ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో ఫొటో తీసుకున్నాడని, ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రజలను ఆందోళనకు గురిచేసే కథనాలు ఇవ్వద్దని ఈ సందర్భంగా మీడియాకు రజత్ కుమార్ సూచించారు.

ఎన్నికల పోలింగ్ శాతానికి సంబంధించి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఆ నివేదికలు పోలింగ్ రోజు సాయంత్రం చెప్పింది, అప్పటికి వచ్చిన వివరాల ఆధారంగా చెప్పామని, తుది శాతం పోలింగ్ మరుసటి రోజే వస్తుందని ముందుగానే చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. పోలింగ్ పూర్తయ్యాక ఎన్ని ఓట్లు పోలయ్యాయో ఏజెంట్లకు 17సీ ఫారంలో ఇస్తామని, ఈ విషయమై ఏమైనా అనుమానాలు ఉంటే ఆయా పార్టీలు, అభ్యర్థులు వారి ఏజెంట్ల వద్ద సరిచూసుకోవాలని సూచించారు. నిజామాబాద్ లో రాత్రి 12.02 గంటలకు పోలింగ్ బృందం రిసెప్షన్ కేంద్రానికి చేరుకుందని, మూడు, నాలుగు దశల్లో పరిశీలించాకే తుది పోలింగ్ శాతం ప్రకటిస్తామని వివరించారు.

Related posts