telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘మా’ డైరీ ఆవిష్కరణలో వివాదం : చిరు మాట్లాడుతుండగా… రాజశేఖర్ మైక్ లాక్కుని…!

MAA

‘మా’ అసోసియేషన్‌లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) డైరీ ఆవిష్కరణ సందర్భంగా వివాదం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి ప్రసంగానికి ‘మా’ వైస్ ప్రెసిడెంట్, హీరో రాజశేఖర్‌ పదే పదే అడ్డుపడ్డారు. చిరంజీవి మాట్లాడుతూ అందరూ కలిసి మెలిసి సాగాలని, మంచి మైకులో చెబుదాం…చెడు చెవిలో చెబుదామని పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగం కొనసాగుతుండగా రాజశేఖర్ పలుమార్లు అడ్డుపడటమేగాక వేదికపైనున్న మరొకరి నుంచి మైక్ లాక్కున్నారు. ఈ నేపథ్యంలో రాజశేఖర్ వేదికపై ఉన్న పెద్దలందరి కాళ్లకూ మొక్కారు. అనంతరం పరుచూరి గోపాలకృష్ణ వద్ద నుంచి మైక్ లాక్కొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ‘మా’ అధ్యక్షుడు నరేశ్ తో ఉన్న విభేదాలపై రాజశేఖర్ ఫైర్ అయ్యారు. ఇండస్ట్రీలో నిప్పురాజుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిప్పుని కప్పి పుచ్చడం సరికాదన్నారు. ‘మా’ అసోసియేషన్‌ వల్ల తన కుటుంబంలో సైతం గొడవలు వచ్చాయన్నారు. అసలు ‘మా’లోని పదవి ఒత్తిడి తనకు కారు ప్రమాదం జరిగిందని రాజశేఖర్ వెల్లడించారు. అనంతరం ఆయన ఆవేశంగా వేదిక దిగి వెళ్లిపోయారు.

రాజశేఖర్ ప్రవర్తనతో ఇబ్బంది పడిన చిరంజీవి, ఈ కార్యక్రమాన్ని రసభాస చేయడానికే రాజశేఖర్ ముందుగా ప్లాన్ చేసుకు వచ్చారేమో అనిపిస్తోందని అన్నారు. మీడియా ముందు గొడవలు పడటం సరికాదని హితవు పలికారు. రాజశేఖర్‌పై ‘మా’ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా చిరు కోరారు. ‘పెద్దల మాటకు విలువలేనప్పుడు మమ్మల్ని పిలవడం ఎందుకు.?. పెద్దలకు గౌరవం ఇవ్వనప్పుడు ఇక్కడ ఎందుకుండాలి..? రాజశేఖర్ కావాలనే వివాదం సృష్టిస్తున్నారు’ అని చిరు ఒకింత ఆగ్రానికి లోనయ్యారు. ఈ గొడవపై ‘మా’ అధ్యక్షుడు నరేష్ స్పందిస్తూ.. బహిరంగంగా మాట్లాడితే చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకుగాను యాక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు.

మరోవైపు.. సీనియర్ నటి జయసుధ కూడా కుర్చీలో నుంచి లేచి వచ్చి ‘రాజశేఖర్.. రాజశేఖర్ కంట్రోల్..’ అని చెప్పినప్పటికీ ఆయన మాత్రం అస్సలు పట్టించుకోలేదు. మాట్లాడాల్సింది మాట్లాడేసి ఆగ్రహంతో కార్యక్రమంలో నుంచి రాజశేఖర్ వెళ్లిపోయారు. ఆ తర్వాత కార్యక్రమానికి వచ్చిన అతిథులు చిరంజీవి, కృష్ణంరాజు, మోహన్ బాబు, జీవిత రాజశేఖర్, జయసుధ ప్రసంగించారు.

మరోవైపు రాజశేఖర్ వ్యాఖ్యలను సీనియర్ హీరో మోహన్ బాబు తప్పుబట్టారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమం మెగాస్టార్ చిరంజీవి డైలాగ్ కింగ్‌ మోహన్ బాబు మధ్య నున్న స్నేహబంధం వెల్లివిరిసింది. సభలో మాట్లాడిన మోహన్‌బాబు… తనకు, చిరంజీవికి మధ్య నడిచేవి ఛలోక్తులు మాత్రమేనన్నారు. ఎప్పటికీ తమ రెండు కుటుంబాలు ఒక్కటేనని స్పష్టం చేశారు. మోహన్‌బాబు మాట్లాడుతున్నప్పుడే ఆయన దగ్గరకు చిరంజీవి వెళ్ళి, మెడ చుట్టూ చేతులు వేసి, ఆప్యాయతతో పలుకరించి బుగ్గపై ముద్దిచ్చి, భుజం తట్టి వెళ్ళారు. ఇదే సభలో పాల్గొన్న ‘మా’ వైస్ ప్రెసిడెంట్, హీరో రాజశేఖర్ ప్రవర్తించిన తీరుపై మోహన్ బాబు మండిపడ్డారు. ‘మా’ ఎవడబ్బ సొత్తు కాదు.. అందరి సొత్తు.. అన్నారు. 40 ఏళ్లుగా సినీ పరిశ్రమకు ఎన్నో సేవలందించి, పరిశ్రమను ఆదుకున్న ఏకైక వ్యక్తి టి.సుబ్బరామిరెడ్డి ఎదుట ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts