telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

నేడే .. కోటిమంది ఖాతాలలో.. కేంద్ర రైతు పథకం నగదు డిపాజిట్.. 2వేలు ..

rait samman scheme deposits today

ఇటీవల కేంద్రప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కోసం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా అయిదు ఎకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు కేంద్రప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఏటా 6000 రూపాయలను చెల్లిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలోమూడు విడతలుగా ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. ఒక్కో త్రైమాసికంలో 2000 రూపాయల చొప్పున మొత్తాన్ని అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. గోరఖ్‌పూర్‌లో ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహించబోయే బహిరంగ సభలో ప్రధాని ఈ పథకాన్ని ప్రకటించబోతున్నారు.

ఈ పథకం కిందికి దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులు వస్తారని కేంద్రం అంచనా వేసింది. ఈ పథకం ప్రారంభమైన వెంటనే.. కోటి మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 2000 రూపాయలు జమ అవుతాయి. దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ పూర్తి చేసింది కేంద్రం. అర్హులైన రైతుల ఎంపిక కూడా పూర్తయింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ పోర్టల్ ను కూడా ప్రారంభించింది. అర్హులైన రైతుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఇదివరకే ఈ పోర్టల్ ద్వారా కేంద్రానికి అందజేశాయి. వాటి ఆధారంగా కేంద్రం నిధులను బదిలీ చేయనుంది. తొలిదశలో కోటి మంది, మలి దశలో మిగిలిన రైతుల ఖాతాల్లో మరో వారం రోజుల్లోగా ఈ మొత్తం జమ అవుతుంది. గత ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి తెచ్చినట్టుగా కేంద్రం చూపిస్తోంది. అందుకే 2018-19 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించిన 2000 రూపాయల బకాయిలను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబోతున్నట్లు చెబుతోంది.

Related posts