telugu navyamedia
రాజకీయ వార్తలు

రాహుల్ భారతీయుడే.. ఢిల్లీ ఆసుపత్రిలో జన్మించారు: రిటైర్డ్ నర్సు

rahul gandhi to ap on 31st

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జాతీయతపై పలు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందని, ఆయన పేరు రావుల్ విన్సీ అని ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేరళకు చెందిన రాజమ్మ వవాతిల్ అనే విశ్రాంత నర్సు కీలకమైన సమాచారం అందించారు. రాహుల్ జాతీయతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాజమ్మ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో తాను ట్రయినీ నర్సుగా ఉన్న సమయంలోనే సోనియా గాంధీ ప్రసవం కోసం వచ్చారని తెలిపారు. డెలివరీ రూమ్ బయట ఆమె భర్త రాజీవ్ గాంధీ, ఆయన సోదరుడు సంజయ్ గాంధీ ఉన్నారని తెలిపారు.

రాహుల్ పుట్టగానే ఎత్తుకున్న వాళ్లలో తాను కూడా ఉన్నానని రాజమ్మ వెల్లడించారు. రాహుల్ గాంధీ భారత పౌరుడే అని చెప్పడానికి ఇంతకంటే ఏం ఆధారాలు కావాలని ఆమె ప్రశ్నించారు. పుట్టినప్పుడు రాహుల్ గాంధీ ఎంతో ముద్దుగా ఉన్నాడని చెప్పారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ మనవడ్ని ఎత్తుకునే అదృష్టం తనకు దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారని వెల్లడించారు. రాహుల్ కేరళ లోని వాయనాడ్ వస్తే ఆయనను తప్పకుండా కలుస్తానని రాజమ్మ తెలిపారు.  

Related posts