telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో త్వరలో .. రచ్చబండ కార్యక్రమాలు ప్రారంభం..

రాష్ట్రంలో త్వరలో రచ్చబండ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో ఆయన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రచ్చబండ కార్యక్రమాన్ని అది జరిగే తీరును ప్రస్తావించారు. ‘జనవరి లేదా ఫిబ్రవరిలో రచ్చబండ కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తా. ప్రజల నుండి వినతులు వస్తే వాటి పరిష్కారానికి హామీలు ఇస్తాం. వాటిని నెరవేర్చేలా చూడాల్సిన బాధ్యత మీదే. ముఖ్యమంత్రిగా నేను ఒక మాట చెప్పానంటే అది ప్రభుత్వం చెప్పినట్టే. అందువల్ల ఎటువంటి తాత్సారం ఉండకూడదు. ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్న మాట రాకూడదు. దీనికి అన్ని శాఖలు ఇప్పటి నుండి సిద్దం కావాలి.’ అని అన్నారు. ‘ఏదైనా శంకుస్థాపన చేస్తే నాలుగువారాల్లో పనులు ప్రారంభం కావాలి. పర్యటన తరువాత సమీక్ష నిర్వహిస్తే పనులు ప్రారంభం కాలేదన్న మాట రాకూడదు.’ అని చెప్పారు.

గత ప్రభుత్వం రూ.40 వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగులో పెట్టిందని, రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని ఈ సందర్భంగ ముఖ్యమంత్రి చెప్పారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడంపై దృష్టి సారించాలని చెప్పారు. అనవసర వ్యయాన్ని తగ్గించడానికి అధికారులు కృషి చేయాలన్నారు. ప్రాధాన్య అంశాలపై దృష్టి పెట్టి ముందుకు సాగాలని, లేకపోతే ప్రయోజనం ఉండదని గుర్తుచేశారు. నవరత్నాల అమలే రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతని చెప్పారు. నిధులను అక్కడ కొంత, ఇక్కడ కొంత ఖర్చు చేస్తే ప్రయోజనం ఉండదన్నారు. సామాన్యులపై భారం మోపకుండా ప్రభుత్వ ఆదాయం ఎలా పెంచుకోవాలో ఆలోచనలు చేయాలని సూచించారు. ఢిల్లీలో ఉన్న రాష్ట్ర అధికారుల సేవలను కూడా వినియోగించుకోవాలని, కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులను తెచ్చుకునే విధంగా పనితీరు ఉండాలన్నారు.

Related posts