telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

తెలుగు వారి పండగ… మన ఉగాది

ఉగాది వచ్చిందని, వసంతాన్ని వెంట తెచ్చిందని,
మా పచ్చని పల్లెసీమ
అచ్చతెలుగు పదహారణాల పడుచు వలె
చెంగు చెంగున గంతులేస్తున్నట్టుంది…
అనాది ఆచారాలు అంతో ఇంతో వున్న
మా పల్లె కల్పవల్లి,పచ్చదనం చిగురింతలో
పట్టుచీర కట్టిన అమ్మోరిలా
నిండు దనంతో ,కొండల మద్యనుంచి వస్తున్న
సూరీడు అమ్మ నుదుటి సింధూరంలాకనిపిస్తు
వూరికే కొత్త కళ ను తెచ్చింది,
యుగానికే ఆది ఉగాది పండుగ….
కోలాహలంగా కోలాటం వేస్తూ
చిన్న పెద్దలు కుతూహలంగా చూస్తు
అచ్చట్లు ముచ్చట్ల సందడిలో అందరూ ఉండగా,
సర్వం మైమరిచేలా
ఓ స్వరం కోటి వీణలు మీటినట్టుగా
సప్త స్వరాలు తరంగాలై తరలివచ్చిన ట్లుగా
గంధర్వ లోకమే సుందరంగా
గానసభ మాపల్లెలో కొలువు దీరిన ట్లుగా
కుహు కుహూ రాగాలు తీస్తు కోయిలమ్మ
కొమ్మల్లో కూస్తోందీ,ఆనందంగా పాడుతోంది ఇలా..
ఉగాది నాకు పర్వదినం
వసంతమే నా నివాసం
పంచభూతాలే నా పంచ ప్రాణాలు..
పచ్చదనమే నా ఆరో ప్రాణం…
మావి చిగురే నా మధుర ఆహారం..
సుమధుర స్వరం పలికించే
మావి ఎంత తిన్నా తనివి తీరదు నాకంటు
ఆమని పాడుతోంది హాయిగా తీయగా…

Related posts