telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

నెత్తుటి మరకలు

మలుపులున్న దారి
మృత్యువు పొంచివున్న దారి
దారి పొడవునా నెత్తుటి మరకలు
దారంతా వినిపిస్తున్న మృత్యుఘోషలు
రక్తాల వసంతాలు జరుపుకున్న దారి
శవాల చలిమంటలు కాచుకున్న దారి
పడుతుల ఐదోతనాన్ని లాగేసుకున్న దారి
ఎందరినో అనాధలుగా మార్చిన దారి
మద్యం నిషాలో, నిద్ర మత్తులో
అప్రమత్తతలేని వాహన చోదకులెందరినో
మృత్యుఒడికి చేర్చిన దారి
కన్నవారికి, కట్టుకున్న వారికి
గర్భశోఖాన్ని మిగిల్చిన దారి
పొదల చాటున ఎందరో స్త్రీలపై జరిగిన
సామూహిక మానభంగాలకు ప్రత్యక్ష సాక్షి
ఆ మలుపుల దారి
కొండల కోనలలో పారిన ఎర్రని వీరుల
రక్తాన్ని రుచి చూసిన దారి
రాజకీయ కక్షలకి, అధికార దాహాలకి బలైన
దేశ సేవకుల రుధిరాన్ని తాగిన మలుపుల దారి
ఎన్నో కన్నీటిగాధలకి
తరాల నాటి రక్తచరిత్రలకి
నాటికి నేటికి ప్రత్యక్ష సాక్షి
ఆ మలుపుల దారి….

Related posts