telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

తొలకరి చినుకులకు స్వాగతం

 

వర్షమా.. వర్షమా.. వర్షించుమా..!

 అవనికి హర్షం కలిగించుమా

చినుకుల సిరులు కురిపించుమా

ప్రకృతికి పులకింత కలిగించుమా

 

జలజలా పారేటి జలము నీవమ్మా

గలగలా సాగేటి గంగ నీవమ్మా

వాగుల్లో వంకల్లో ప్రవహించుమా

చెరువులు సరస్సులు నిండించుమా

 

రైతులు నాగలితో నమస్కరించేనమ్మా

వడివడిగా ఏరువాక సాగెదరమ్మా

నాగేటి సాల్లల్ల నడయాడవమ్మా

బంగారు పంటలు పండించురమ్మా

 

నీకరుణ లేకుంటే మాబతుకులు ఎడారేనమ్మా

కరువు కాటకాలు తీర్చే కల్పవల్లివి నీవమ్మా

సాగుతాగు నీటిని అందించే చల్లని తల్లివమ్మా

 ఇదిగిదిగో మా నీరాజనాలు అందుకోనవమ్మా

 

తొలకరి చినుకులకు స్వాగతం

నీలి మేఘాలు వర్షిస్తేనే ఆహ్లాదం

ప్రకృతి పునఃసృష్టికి ప్రతిరూపం

నేలతల్లి తడిస్తేనే పరిణామానికి వికాస

 

పుడమి వర్షధారలతో పులకిస్తేనే

వర్షం కురిస్తేనే..నదులు,కాలువలు నిండేది

ఏరువాక సాగేది ..నాటు పడేది

పంటలు పండేది..గాదెలు నిండేది 

 

అన్నదాత కంటతడి ఆగేది

రైతు ఆశ బతికేది

మన కడుపు నిండేది..

పరిశ్రమలు నడిచేది..ఉత్పత్తి పెరిగేది

 

నైరుతి రుతుపవనం

కరుణించక పోతే కష్టం

మానవ ,జంతు జాతుల దాహం తీరదు

కరువు తీరదు..వలసలు ఆగవు

 

వర్షం సృష్టి అద్భుతం

ప్రకృతితో ఆడే చదరంగం

కాలుష్యపు పోకడలతో

వాతావరణ విధ్వంసం

 

పాలకుల పర్యావరణ నిర్లక్ష్యం

అతివృష్టి ,అనావృష్టి కి కారణం

జగతికి నష్టదాయకం..

 –

Related posts