telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

లవ్ ఫెల్యూర్

ఫలించని మన ప్రేమ కధను మళ్ళీ వ్రాస్తాను
ఉషోదయంలేని విషాదపు చీకటిని
మళ్ళీ నాకందిస్తావని తెలిసే…
నువ్వు విరిచేసిన మన ప్రేమ మొక్కకు
మళ్ళీ కొంచెం నీళ్ళేస్తాను
చిగురేసినా నువ్వు చిదిమేస్తావని తెలిసే…
మనమెళ్ళిన దారిగుండా
మళ్ళీ ఒకసారేళతాను
నీవు నాటిన నిరాదరణ ముళ్ళు
నిలువునా ఇంకా అక్కడ నిలుచున్నాయని తెలిసే…
నిన్ను మరువలేని నా హృదయాన్ని
నీ పాదాలదగ్గర పరిచేస్తాను
నువ్వు లెక్కచేయకుండా
మట్టికాళ్ళతో మళ్ళీ తొక్కేస్తావని తెలిసే…
నువ్వు పాదరసంలా మెత్తని లోహానివని తెలిసినా
నా గళంలో గరళమై
నన్ను హరిస్తావని తెలిసినా
మళ్ళీ మన ప్రేమకధను నీకు వినిపిస్తాను
నీ పాషాణహృదయం ఇప్పుడైనా ప్రేమపుష్పం
పూస్తుందేమో చూస్తాను…
పూచినా మొగ్గలోనే ఖర్ఖశంగా నువ్వు తృంచేస్తావని తెలిసే…
నువ్వు నిలువునా నరికేసిన నా ఊహల్లో
సగానికి కూల్చేసిన నా దేహంలో
నీవే ఇంకా నివాసమున్నావని చెబుతాను
నువ్వు పరిహాసంగా నవ్వుతావని తెలిసే…

Related posts