telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఓ..నా “ప్రియ”మైన కన్నీటి చుక్కా..!

ఆనందం అంటే 

నాకు అసహ్యం 

 

సుఖం నాకు సుదూరం 

చిరునవ్వు నా శతృ దేశం 

 

దుఃఖం నా ఇలాకా 

దరిద్రం నా పతాకా 

 

నా చీము నెత్తురులే 

నా పాలిటి అమృతం 

నేను అమ్మ కడుపు లోనే 

అమృతం తాగాను 

చావు నన్ను వెతుక్కుంటూ రావడం కాదు 

నేను చావు ను ఎక్కడ ఉన్నావ్ అంటూ 

ఆత్మీయంగా ఆప్యాయంగా 

పరిశోధించడమే నా జీవితకాలం 

 

కాగితాల మీది పట్టా కాదు,  

కాలం నాకు ఇచ్చే పట్టా 

ఏ క్యాంపస్ లో దొరికేది కాదు 

నా కన్నీళ్ల లోంచి వెలికి తీసేది  

 

కన్నీటి లోని 

కమ్మని తనం 

అమ్మ తనం ఇచ్చే 

అపురూపమైన, అనిర్వచనీయమైన 

చల్లదనం 

ప్రపంచ నలుమూలలా 

నాకు ఇంకెక్కడా దొరకదు 

ఒక్క నాలో తప్పా 

 

నా నీడ లో నేను 

తల దాచుకుంటాను 

నా కడుపులోనే నేను 

నా గెలుపును రచిస్తాను 

నా పేగుల

వాటి ఆకలి మంటల లోనే 

నా ఒంటరి తనాన్ని కాల్చి బూడిద చేస్తాను 

ఆకలి నాకు 

అన్ని వేళలా తోడుంటుంది 

మా స్నేహానికి 

వేళా పాలా లేదు 

ప్రతీ పూట పరస్పరం ఎదురవుతాం 

మాట్లాడుకుంటాం 

 

నా పస్తుల ను 

ఏ ప్రపంచ బ్యాంక్ తీర్చలేదు 

నా పంచేంద్రియాలే 

నా పాలిట ఐక్యరాజ్య సమితి 

 

నాకు నేనే 

కన్న తల్లి 

కన్న తండ్రి

 

నా కనుపాప నీడలో 

మెరిసే అద్దాల మేడలే 

నా కన్నీళ్లు 

 

ఓ నా “ప్రియ”మైన కన్నీటి చుక్కా 

నువ్వు నేల రాలి పోయి 

నన్ను నిరంతరం నిలబెడుతున్నావు కదా..!

ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలను 

నిన్ను నిలువెల్లా ప్రేమించడం తప్పా 

ఆపాద మస్తకం అల్లుకోవడం తప్పా 

 

అవును 

నేను నా కన్నీళ్ల ను ప్రేమిస్తున్నాను 

గుండెల కు హత్తుకుంటాను 

 

బాధ నాకు ఇచ్చే హోదా 

నా సర్వేంద్రియాలను 

సర్వ నాడులను 

మేల్కొలుపుతుంది 

నాకు నేను ఏ క్షణం 

పేదవాడిగా కనిపించలేదు 

దరిద్రపు గొట్టు ఈ ప్రపంచానికి తప్పా 

 

నా ఆవేదన 

నా వెన్ను నిమురుతుంటే 

శత్రువే కాదు 

యావత్ ప్రపంచం ఏకమైనా 

నన్ను ఏం చెయ్యగలదు

 

నా కష్టాలు, కన్నీళ్లే 

నా ఆస్తి పాస్తులు 

 

మా వీధి కన్నా 

ఏ విశ్వ సౌందర్యం నన్ను ఆకర్షించలేదు 

మా అరుగు కన్నా 

ఏ సింహాసనం నాకు గొప్ప కాదు 

మా ఇంటి కన్నా 

ఏ రాజభవనం నన్ను ఆశ్చర్య పరచలేదు 

 

నేను తలెత్తు కోవడానికి 

తల్లడిల్లుతున్న తరుణం లో 

నాకు ఒడిని పంచిన నేల 

అది శ్మశానమైనా, మురికి వాడైనా 

నా పాలిటి స్వర్గధామమే కదా..!

 

 

Related posts