అవనిలో అద్భుతం అమ్మయితే
జగతికే జీవం నాన్న
అవును…
ఆలనా పాలనా అమ్మవైన
సూర్యుడు జగతికి వెలుగును ప్రసాదించినట్లు
మౌనంగా మన జీవితానికి వెలుగును
ప్రసాదిస్తాడు నాన్న!
అందమైన కళ్ళు లాంటి అమ్మ
ఆ అమ్మలోని కనుపాప తన పసిపాప
ఆ కంటిని, కంటిలోని పసిపాపని
కాచి కాపాడే కనురెప్ప నాన్న!
అమ్మ ప్రాణం తన బిడ్డలైతే
ఆ గుండెకు రక్షణగా నిలిచే ఎముకల గూడు నాన్న!
నిరంతరం శ్రమిస్తూ తన వారిని ప్రేమిస్తూ
గంభీరమనే ముసుగులో ఉండిపోతాడు నాన్న!
నిండుకుండలా నిబ్బరంగా ఉండి
కుటుంబ రక్షణకై మునిలా దీక్షబూని
చిరునవ్వుని చెరగనీయని
పున్నమి చంద్రుడు నాన్న!
అమావాస్య నాటి చీకట్లు ఎన్ని వచ్చినా…
ప్రాణాలను కూడగట్టుకొని తన పసిపాపలను తారలుగా మలచడానికి మళ్లీ జన్మిస్తాడు నాన్న
అందుకే ఈ జగతికి జీవం నాన్న…!!