telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మనం ఎవరూ మొక్కని దేవుడు వాడే అన్నదాత

విత్తు నుండి ముద్ద వరకూ

కడుపాకలి తీర్చడం మొదలు

ప్రజల ప్రాణాలు నిలపడం వరకు

కీలకమైన శ్రామికుడు వాడు

చెమట ధారల చెలికాడు వాడు..

 

కోరుకున్న వేళ కరుణించని

కరడు గట్టిన మొరటు మేఘాల

మనసు మార్చి కరిగించేందుకు

కప్పలకు పెళ్లి చేస్తాడు వాడు

సైన్స్ సిద్ధాంతాలకు అందనివాడు..

 

పచ్చని భూమి పురుడోసుకుంటే

అక్షయపాత్ర అంశతో పుట్టినట్టు

మట్టి సారాన్ని జీర్ణించుకున్న వాడు

మొలక మూలాల మనసెరిగినోడు

డాక్టరేట్ లేని క్షేత్రశాస్త్రజ్ఞుడు వాడు.

 

కీడు చేసే కీటకాల పాలిట

క్రిమిసంహారకుడౌతాడు వాడు

ఇంటిల్లిపాదీ పస్తులుండాల్సొచ్చినా

దాహమైన చేనుకు చనుబాలౌతాడు

హరిత మానస పుత్రుడు వాడు.

 

వరాల పంట చేతికొచ్చేంత వరకూ

విశ్రమించని శ్రమ యోధుడు వాడు

గిట్టుబాటు ధర పలకదని తెలిసినా

మడమ తిప్పని ధీరోదాత్తుడు వాడు

సాక్షాత్ అన్నపూర్ణావతారం వాడు..

 

గింజ గింజనూ అల్లే గిజిగాడు వాడు

మెతుకు పరిమళాల మొనగాడు వాడు

అమ్మగుణం కలిగిన అన్నదాత వాడు

వ్యవసాయ దేశానికి వెన్నెముక వాడు

మనం ఎవరూ మొక్కని దేవుడు వాడు.

 

Related posts