telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

అక్షరం…

కలం అనే విల్లును ధరించి
కవితాశరాలను ఎక్కుబెట్టి
సంఘవిరోదాలన్నింటిని ఎదిరిస్తున్నా
సంఘాన్ని పీడిస్తున్న కపట రాజకీయాలను,
దోపిడి వర్గాలను, అన్యాయాలను
అరాచకాలను అక్షరాల నిప్పులతో కడుగుతున్నా
అర్జునుడిలా చెడుపై అక్షర యుద్దాన్నే చేస్తున్నా
అయినా విజయమేలేక
ప్రతినిత్యం నేనోడిపోతున్నా
సమాజంలో మానవత్వాన్ని నింపలేకపోతున్నా
మంచితనాన్ని పెంచలేక వొడిబడుతున్నా
అమ్మతత్వాన్ని నేర్పలేకపోతున్నా
మరి ఇన్నాళ్లుగా ప్రపంచాన్ని మార్చలేని
నా రాతలన్ని నిర్జీవాలేనా
సంఘంలో అభ్యుదయ భావాలని
పొంగించలేని నా కవితలన్ని
బూడిదలో పోసిన పన్నీరులేనా
జనంలో చైతన్యాన్ని రగిలించలేని
నా అక్షరాలన్ని నిర్వీర్యమేనా
కాదు కాదు క్షయం లేని అక్షరాన్ని నేను
కాని సమాజాన్ని మార్చలేని
ప్రజల్లో చైతన్య కాంతులని ప్రసరింపచేయలేని
అక్షరాలని కన్న నేను గొడ్రాలినే
కాంతిలేని అక్షరాల సూర్యున్ని
రోజూ కంటున్న నేను మాత్రం గొడ్రాలినే…

Related posts