telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ నేత పీవీపీ అరెస్ట్.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు!

pvp warning to media again on twitter

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పొట్లూరి వర ప్రసాద్ పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు కేసును రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. విక్రమ్ కైలాశ్ అనే వ్యక్తి ఫిర్యాదుపై దీనిని నమోదు చేశారు. తాను ఇంటి నిర్మాణాన్ని మార్చుకుంటుంటే, పీవీపీ, తన అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేశారని పేర్కొన్నారు.

అనంతరం ఇరువురినీ బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు విచారణకు పిలిపించారు. ఇరువురి వాదనలు విన్నారు. ఘటనా స్థలికి వెళ్లి, అక్కడి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం పీవీపీని అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్లు 447, 427, 506 కింద హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ప్రేమ్ పర్వత్ విల్లాస్ పేరిట పీవీపీ నిర్మాణాలు చేపట్టారు. వీటిలో కైలాస్ విక్రమ్ అనే వ్యక్తి నాలుగు నెలల క్రితం ఒక విల్లాను కొన్నారు. ఆ తర్వాత దానిని మరింత ఆధునికీకరించేందుకు పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న పీవీపీ తన అనుచరులతో కలసి అక్కడకు వెళ్లారు. నిర్మాణ సామగ్రిని దించుతున్న వారిని అడ్డుకున్నారు.

విక్రమ్ ఇంట్లోకి ప్రవేశించి ఫర్నిచర్ ను పీవీపీ ధ్వంసం చేశారు. దీంతో, బంజారాహిల్స్ పోలీసులకు విక్రమ్ సమాచారం అందించారు. అక్కడకు ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చినప్పటికీ పీవీపీ ఆగలేదు. దీంతో, విక్రమ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనను చంపేస్తానని పీవీపీ బెదిరించారని ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

Related posts