telugu navyamedia
క్రైమ్ వార్తలు

భారత్ దెబ్బకు పాక్ గుండెల్లో దడ… సాయం కోసం ఐరాసకు లేఖ!

పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ తీవ్ర స్థాయిలో స్పందిస్తుండడంతో పాకిస్తాన్‌కు దడ పట్టుకుంది. సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో పుల్వామా దాడి వెనుక సూత్రధారి, జైషే కమాండర్ ఘాజీ రషీద్‌ సహా ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఐక్య రాజ్య సమితి పాకిస్తాన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్స్‌కి లేఖ రాశారు. 
పాకిస్తాన్‌పై భారత్ తన సైన్యాన్ని ప్రయోగించే అవకాశం ఉండడంతో మా ప్రాంతంలో భద్రతా పరిస్థితి క్షీణిస్తోంది. దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతున్నానని ఖురేషీ సదరు లేఖలో పేర్కొన్నట్టు పాక్ విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత సైనికులపై పుల్వామాలో జరిగిన దాడి కశ్మీరీ వ్యక్తి పనేననీ… కానీ విచారణ కూడా పూర్తి కాకుండానే పాకిస్తాన్‌ను నిందించడంలో అర్థం లేదని ఖురేషీ పేర్కొన్నారు. కాగా కశ్మీర్ అంశంపై మూడో పార్టీ ప్రమేయాన్ని భారత్ తిరస్కరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. భారత్-పాక్ వ్యవహారాలను కేవలం ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని భారత్ స్పష్టంగా చెబుతున్న సంగతి తెలిసిందే.

Related posts