telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రియాంక పోటీ చేయాలని అధిష్ఠానంపై నేతల ఒత్తిడి!

Priyanka Gandhi started Ist road show

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌కు ఆమె ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. అధిష్ఠానం కోరితే ఈ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమేనంటూ ప్రియాంక ఇటీవల ప్రకటించారు. ఆమె వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ నేతల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. యూపీలోని ఏదో ఒక స్థానం నుంచి ఆమె పోటీ చేయాల్సిందేనని కాంగ్రెస్ నేతలు అధిష్ఠానంపై ఒత్తిడి పెంచుతున్నారు.

ప్రియాంక ఎన్నికల బరిలోకి దిగడం వల్ల పార్టీ విజయావకాశాలు మరింత పెరుగుతాయని నేతలు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తున్నారు. తాజాగా, యూపీ శాసనసభాపక్ష మాజీ నేత ప్రదీప్ మాథుర్ మాట్లాడుతూ.. ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందన్నారు. ఆమెను చూస్తుంటే తమకు ఇందిరా గాంధీ గుర్తొస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో యూపీలోని ఏదో ఒక స్థానం నుంచి ఆమె బరిలోకి దిగితే బాగుంటుందని భావిస్తున్నట్టు చెప్పారు.

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక సేవలు ఎంతో అవసరమని మరో నేత రాజేశ్ మిశ్రా పేర్కొన్నారు. ఆమె పోటీకి దిగితే కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. వారణాసి నుంచి కానీ, అలహాబాద్ నుంచి కానీ ప్రియాంక పోటీ చేసే అవకాశం ఉందని ఈ విషయాన్ని పార్టీ నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

Related posts